వత్సవాయి సొసైటీలో గోల్‌మాల్ ! | Sakshi
Sakshi News home page

వత్సవాయి సొసైటీలో గోల్‌మాల్ !

Published Sat, Sep 7 2013 3:49 AM

VATSAVAYI Society Golmaal!

వత్సవాయి, న్యూస్‌లైన్ : పిల్లల ఉన్నత చదువులు, పెళ్ళిళ్లు, వ్యవసాయ పనులు తదితర అవసరాల కోసం స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఖాతాదారులు దాచుకున్న సొమ్మును సిబ్బంది గోల్‌మాల్ చేసిన విషయం  వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుల్లో కొందరు సొసైటీ కార్యాలయానికి వచ్చి తాము దాచుకున్న డబ్బు తమ ఖాతాలలో లేదని తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం ఒక్కరోజు వచ్చి న సొసైటీకి వచ్చిన బాధితులకు సంబంధించిన ఖాతాల్లో రూ.10 లక్షలకు పైగా మాయం అయినట్లు తేలింది.

ఇంకా ఈ విషయం తెలియని వారు ఎక్కువమంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సొసైటీలో  రెండువేల మందికి పైగా సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలోనే నగదు మాయం అయినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. సొసైటీలో రూ.2.20 కోట్లకు పైగా డిపాజిట్లు ఉండగా, రూ.2 కోట్లకు పైగా బంగారు వస్తువులపై రుణాలు మంజూరు చేసినట్లు తెలి సింది. ఖాతాదారులు సొసైటీలో నగదు జమ చేసినప్పుడు వారి పాసు పుస్తకాలలో సిబ్బంది నమో దు చేశారు. సొసైటీ క్యాష్ రికార్డులలో మాత్రం ఎంట్రీలు లేవని, ఖాతాదారుల సొమ్మును సిబ్బంది సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది.

సొసైటీ క్యాషియర్ నాగేశ్వరరావు నాలుగు రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఖాతాదారులు కొందరు కార్యాలయానికి వచ్చి తమ ఖాతాల వివరాలు తెలుసుకోగా, నగదు మాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది.  సొసైటీలో సొమ్ము దాచుకున్న షేక్ జాన్‌మియా, కుక్కల ప్రసా ద్, కంచేటి రామారావు, షేక్ జాన్‌వలీ, ఎం.వెంకటేశ్వర్లు, మౌలాబీ, కొలుసు గంగిరాజు, పట్టాభి, ఆదాం సాహెబ్, వైకుంఠపు రామారావు, కంచం శ్రీను, ఎన్ వెంకటేశ్వర్లు, కొలికపోగు వెంకటనర్సమ్మ, గజ్జా జాలయ్య ఖాతాల నుంచి నగదు మాయమైనట్లు తేలింది.

ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు కొందరు కార్యాలయానికి వచ్చారు. అక్కడ సమాధానం చెప్పే వారు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై సొసైటీ కార్యదర్శి చిట్టూరి శ్రీనివాసరావు, క్యాషియర్ రాయల నాగేశ్వరరావును వివరణ కోరగా, ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, సొమ్ము రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.  
 

Advertisement
Advertisement