‘గేటు’ దాటితే కేసు! | Sakshi
Sakshi News home page

‘గేటు’ దాటితే కేసు!

Published Mon, Aug 4 2014 1:57 AM

‘గేటు’ దాటితే కేసు! - Sakshi

రైల్వే క్రాసింగ్స్ వద్ద నేటి నుంచి ప్రత్యేక నిఘా   
నిబంధనలు ఉల్లంఘిస్తే  జరిమానా, జైలు శిక్ష!


 హైదరాబాద్: లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు గేటు పడితే కింద నుంచి దూరి వెళ్లటం సర్వసాధారణం. కానీ, సోమవారం నుంచి అలా వెళ్తే  జరిమానాతో పాటు జైలు ఊచలు కూడా లెక్కపెట్టాల్సిందే. మెదక్‌జిల్లా మాసాయిపేట లెవెల్‌క్రాసింగ్ వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొని 18 మంది చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో లెవెల్ క్రాసింగుల వద్ద రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా అధికసంఖ్యలో వాహనాలు ప్రయాణించే లెవెల్ క్రాసింగులపై ప్రత్యేక దృష్టి సారించింది. క్రాసింగ్స్ వద్ద రైల్వే పోలీసులను నియమించి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి కేసులు నమోదు చేయనుంది.

రైల్వే చట్టం ప్రకారం కేసులు: రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఈ కేసులు నమోదు చేస్తారు. దీని ప్రకారం గేటు వేసిన తర్వాత దాన్ని ఖాతరు చేయకుండా వెళ్లే వారికి 6 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణికుల ప్రాణాలకు ఇబ్బంది తెచ్చేలా వ్యవహరించినందుకు సెక్షన్ 154 ప్రకారం జైలు శిక్షను ఏడాది వరకు పెంచే వెసులుబాటు కూడా ఉంది. ఈ రెండు సెక్షన్‌లను సోమవారం నుంచి ముఖ్య క్రాసింగుల వద్ద గట్టిగా అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే ఆదేశాలిచ్చింది.
 

Advertisement
Advertisement