వక్ఫ్ భూములే! | Sakshi
Sakshi News home page

వక్ఫ్ భూములే!

Published Tue, Mar 10 2015 2:48 AM

Waqf lands!

సాక్షి ప్రతినిధి, కర్నూలు : వక్ఫ్ ఆస్తులపై జిల్లా యంత్రాంగంలో కదలిక మొదలైంది. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు వక్ఫ్ ఆస్తులను రీ సర్వే చేయడంతో పాటు ఆక్రమణదారుల పేరిట ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయనున్నారు. వీరి పేరిట ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేసి.. వక్ఫ్ బోర్డు పేరిట ఆస్తులను బదలాయించాలని కూడా జిల్లా అధికార యంత్రాంగం సిద్దమవుతోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే కల్లూరులోని 356 సర్వే నెంబరులోని 21 ఎకరాల 79 సెంట్ల స్థలంతో పాటు సర్వే నెంబరు 124లో ఉన్న భూమి కూడా వక్ఫ్‌బోర్డుదేనని జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ మేరకు కలెక్టర్‌తో పాటు వక్ఫ్‌బోర్డు సీఈవోకు కర్నూలు జిల్లా వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ నివేదిక సమర్పించినట్టు సమాచారం. వక్ఫ్ భూముల ఆక్రమణలపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు.
 
పాసు పుస్తకాలు రద్దు
జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను వెంటనే సర్వే చేయించడంతో పాటు ఈ ఆస్తులను ఆక్రమించిన వారికి నోటీసులు జారీచేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నంద్యాలలోని నూనెపల్లిలో వక్ఫ్ ఆస్తిని ఆక్రమించుకున్న వారిపై కేసులను నమోదు చేశారు. అంతేకాకుండా పై రెండు సర్వే నెంబర్లను మళ్లీ రీ-సర్వే చేయడంతో పాటు ఈ స్థలాలను ఆక్రమించుకున్న వారిపై కేసులు కూడా నమోదు చేయనున్నారు. వీరి పాసుపుస్తకాలను రద్దు చేయనున్నట్లు తెలిసింది. ఈ ఆస్తులను వక్ఫ్ బోర్డు పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకూ రంగం సిద్ధమైంది. మొత్తం మీద వక్ఫ్‌ఆస్తులు వక్ఫ్‌బోర్డుకే చెందేట్టుగా చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కృతనిశ్చయంతో ఉంది.
 
రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులపైనా చర్యలు
వాస్తవానికి కల్లూరులోని సర్వే నెంబరు 124 వక్ఫ్‌బోర్డు ఆస్తి అని.. ఈ ఆస్తిని ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించవద్దని ఇప్పటికే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖకు వక్ఫ్‌బోర్డు లేఖ రాసింది. అయినప్పటికీ ఈ లేఖను పక్కన పెడుతూ 2014 ఆగస్టులో రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బంది వివిధ వ్యక్తుల పేర్ల మీద ముక్కలు ముక్కలు చేసి రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కదులుతోంది.

అదేవిధంగా కర్నూలు గ్రామంలోని సర్వే నెంబరు 62లోని 5.32 ఎకరాల భూమి కూడా వక్ఫ్‌బోర్డుదేనని అధికారులు గుర్తించారు. అయితే, ఈ సర్వే నెంబరులో రీ-సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వాలని వక్ఫ్‌బోర్డు సీఈవోకు స్థానిక ఇన్‌స్పెక్టర్ లేఖ రాశారు. అదేవిధంగా ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకట్టవేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయాలని ఆయన ఈ లేఖలో కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పాసు పుస్తకాలను రద్దు చేయాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశించాలని కూడా ఈ లేఖలో సీఈవోను ఆయన కోరినట్టు తెలిసింది.
 
ఆస్తులు ఆక్రమిస్తే కఠిన చర్యలు
వక్ఫ్‌బోర్డు ఆస్తులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా ఎవరైనా ఆక్రమించినా...పాసు పుస్తకాలు జారీ అయినా రద్దు చేస్తాం. అవసరమైతే పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని వెంటనే వారిని ఖాళీ చేయిస్తాం. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం.
  - సీహెచ్ విజయమోహన్, కలెక్టర్, కర్నూలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement