నీరు ప్రగతి... ఇదేమి పద్ధతి! | Sakshi
Sakshi News home page

నీరు ప్రగతి... ఇదేమి పద్ధతి!

Published Thu, May 4 2017 11:12 AM

నీరు ప్రగతి... ఇదేమి పద్ధతి!

► ఆన్‌లైన్‌లో పని వివరాలు నమోదు
► రాష్ట్రస్థాయిలో పరిశీలన.. నంబరింగ్‌
► ఆపై జిల్లా కలెక్టరు ఆమోదం
► ఇలా అయితే కష్టమే అంటున్న అధికారులు  


బద్వేలు: ప్రభుత్వ నిబంధనలు రోజుకోరీతిన మారుతున్నాయి. ఇది అధికారులకు తలనొప్పిగా పరిణమిస్తోంది. తక్కువ సమయం ఇచ్చి గడువులోగా లక్ష్యం పూర్తిచేయాలని చెబుతుండటంతో వారిపై ఒత్తిడి పెరిగిపోతోంది. వివరాల్లోకి వెళితే.. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వం పెద్ద ఎత్తున నీరు–ప్రగతి పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు చెక్‌డ్యాంలు, పూడికతీతలు, కాలువ మరమ్మతు వంటి పనులు చేపట్టి భారీగా భూగర్భజలాలుపెంచాలని భావిస్తోంది.

కానీ ఈ పనులన్నింటినీ మూడు నెలల్లో పూర్తిచేయాలని నిర్దేశించడంతో పాటు ఈ పనుల మంజూరుకు విధించిన నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి. నీరు–ప్రగతి కింద జిల్లాలో రూ.200 కోట్ల వరకు పనులు చేపట్టే అవకాశం ఉంది. వీటిలో అధిక భాగం చిన్ననీటి పారుదల శాఖ ద్వారానే చేపట్టనున్నారు. ఇంకా డ్వామా, డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ, భూగర్భజలశాఖ, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా చెరువులు, వాగులు, వంకల్లో పూడికతీతలు, చెక్‌డ్యాంల నిర్మాణం, పాతవాటికి మరమ్మతులు చేపడతారు.

ఈ ఏడాది పనుల మంజూరు, అనుమతుల విషయంలో కొత్త నిబంధనలు పెట్టారు. ఈ అనుమతులు వచ్చేసరికి తీవ్ర జాప్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సకాలంలో పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదని స్వయంగా అధికారులే పెదవివిరుస్తున్నారు.

ఇలా చేయాల్సిందే...
అధిక పనులు చిన్న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ పనులకు సంబంధించి మొదట క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వీటిని రాజధాని అమరావతిలోని జలవనరుల శాఖ కార్యదర్శి కార్యాలయం పరిశీలించి ఒక్కో పనికి ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తుంది. అనంతరం జిల్లాలోని అధికారులు ఆ పని వివరాలను నమోదు చేసుకుని కలెక్టరు అనుమతికి పంపాలి. ఆయన మరోసారి పరిశీలించి ఆమోదించాలి.

ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో ఎప్పుడు పరిశీలన చేయాలి?.. ప్రతిపాదనలు తయారు చేసి ఎప్పుడు జలవనరుల శాఖ కార్యదర్శి కార్యాలయానికి పంపాలి?. అక్కడి నుంచి అనుమతులు రావడం.. మళ్లీ జిల్లాలో అనుమతులు ఎప్పుడు తీసుకోవాలి?... పనులు కేటాయింపు, పూర్తి చేయడమెలా అనే అభిప్రాయంలో నీటి పారుదల శాఖ అధికారులు ఉన్నారు. దాదాపు రూ.200కోట్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలు, రాష్ట్రస్థాయిలో అనుమతులు ఎప్పుడు వస్తాయనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.
నీరు–ప్రగతి కష్టమే
నీరు–ప్రగతి పనులన్నీ దాదాపు రూ.10 లక్షలలోపు ఉండనున్నాయి. వీటిని అధికారపార్టీ వర్గీయులకు నామినేషన్‌పై ఇవ్వనున్నారు. అయితే చిన్న నీటిపారుదల శాఖ కింద చేపట్టే పనులు భారీసంఖ్యలో ఉండటం, జలవనరుల శాఖ కార్యదర్శి కార్యాలయానికి అన్ని జిల్లాల నుంచి నీరు–ప్రగతి పనులు ప్రతిపాదనలు వేల సంఖ్యలో వస్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ అనుమతులు ఇవ్వడంలో తీవ్ర జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో లక్ష్య నిర్ధేశిత గడువు 90రోజుల్లో పూర్తవడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. జూన్‌లో వర్షాలు పడతాయని ఈలోపు సగం పనులు పూర్తిచేసిన గొప్పేనని చెబుతున్నారు. ఒక్కో ఏఈ మండల స్థాయిలో కనీసం 100 వరకు పనులను పరిశీలించి అన్‌లైన్‌లో నమోదు చేయాలి. నమోదుతో పాటు జీపీఎస్‌ పొజిషన్‌ కూడా సరిచూడాలి. ఇలా చేయాలంటే వంద పనులకు కనీసం నెలరోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎండలతో ఏఈలు, వారి సిబ్బంది పని చేయడం కష్టతరంగా కనిపిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement