అనుబంధమా... బలి కోరొద్దు! | Sakshi
Sakshi News home page

అనుబంధమా... బలి కోరొద్దు!

Published Wed, Oct 8 2014 11:10 AM

గురుప్రసాద్ కొడుకులు  విఠల్ విరించి, నందవిహారి

పిల్లలను చంపి పెద్దలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలొ ఎక్కువయ్యాయి. తల్లిదండ్రుల మధ్య గొడవల్లో పిల్లలు బలిపశులవుతున్న దారుణోదంతాలు అధికమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యావంతులు కూడా విచక్షణ కోల్పోయి ఇలాంటి ఘోరాలకు పాల్పడుతుండడం మరింత భయాందోళన కలిగిస్తోంది. కడప, హైదరాబాద్ లలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఘటనలు వర్తమాన సమాజ విపరీత వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి.

జూన్ 26న ఉత్తరప్రదేశ్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మనీష్ సాహూ(36) తన భార్య  శ్వేతతో పాటు కుమారుడు యష్(5)ను కిరాతకంగా చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని మైహోమ్ అపార్ట్మెంట్ లో అతడీ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన ఇద్దరు కొడుకులను చంపి, పాతిపెట్టి తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. కడపలో కృపాకర్ అనే వ్యక్తి భార్యాపిల్లలను తాను కూడా తనువు చాలించాడు.

ఆర్థిక, వివాహేతర సంబంధాలు ఆలుమగల మధ్య వివాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. విద్యావంతుల విషయానికి వచ్చేసరికి వృతిపరమైన ఒత్తిడి, అహం, ఆధునిక జీవనవిధానం తదితర కారణాలు కాపురాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనన్న భావన కొరవడిన కుటుంబాలు కల్లోలాల బారిన పడుతున్నాయి. ఆధిపత్య ధోరణి ఆలుమగల మధ్య అగాధం పెంచుతోంది. మరోపక్క వృత్తిపరమైన ఒత్తిడి కూడా వైవాహిక సంబంధాల విచ్ఛిన్నానికి కారణమవుతోంది.

సాఫీగా సాగిపోతున్న సంసారంలో కలతలు ఏర్పడితే జీవితాలు తారుమారవుతున్నాయి. దాంపత్య గొడవలతో భార్యాభర్తలు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. తీవ్రమనోవేదనకు లోనయి క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రక్తంపంచుకు పుట్టినవారిని, జీవితాన్ని పంచుకున్న వారిని కడతేర్చి.. తమ జీవితాన్ని అర్థాంతంగా ముగించేందుకు వెనుకాడని నిస్సృహలోనికి కూరుకుపోతున్నారు. ప్రతిసమస్యకు పరిష్కారం ఉంది. అయితే సమస్యను గుర్తించి, దానికి తగిన పరిష్కారం చేయనప్పుడే ఉపద్రవాలు ఎదురవుతున్నాయి. ఆలుమగల మధ్య అనుబంధం బలంగా ఉంటే సమస్యలు వాటికవే సమసిపోతాయి.

Advertisement
Advertisement