Sakshi News home page

మూత్ర విసర్జనకు వెళ్లి ప్రాణం పొగొట్టుకున్నాడు

Published Fri, May 29 2015 5:48 AM

went to urinary excretion life ends

నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనం షేడ్ కూలి విద్యార్థి మృతి
 
 లావేరు : మూత్ర విసర్జన కోసం నిర్మాణంలో ఉన్న హైస్కూల్ తరగతి గది వద్దకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు సన్‌షేడ్ కూలిన ఘటనలో మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన లావేరు మండలంలోని తామాడలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇదే గ్రామానికి చెందిన చిన్ని తౌడు (14) ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... తామాడ గ్రామంలోని హైస్కూల్‌కు అదనపు పాఠశాల భవనం మంజూరు కావడంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సన్‌షేడ్ నిర్మాణ దశ పనులు జరుగుతున్నాయి.

గురువారం చిన్ని తౌడు పాఠశాల భవనం కిందనే బయట ఉన్న ఖాళీ స్థలంలోకి మూత్ర విసర్జ కోసం వెళ్లాడు. అయితే అదే సమయంలో షేడ్ కూలిపోయి తౌడు తలపై  పడడంతో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తౌడు ఇదే పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేశాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న లావేరు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ దాము సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.

 ఏకైక కుమారుడు మృతితో రోదిస్తున్న తల్లిదండ్రులు
 ఏకైక కుమారుడు తౌడు మృతితో తల్లిదండ్రులు సూరి,అశిరప్పలు తీవ్ర విషాదానికి గురయ్యారు. తామేమి పాపం చేశామని భగవంతుడు ఈ శిక్ష విధించాడని రోదించారు. తండ్రి సూరి కుమారుడు తౌడు మృతదేహాన్ని పట్టుకొని లే నాన్నా అంటూ విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా తరగతి గది నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. గతంలో కూడా సన్‌షేడ్ కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనకు బాధ్యులపై చర్య తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడు తౌడు తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేసుతన్నారు. కాగా తౌడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్టు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement