సీమాంధ్ర అసెంబ్లీ కార్యదర్శి ఎవరు? | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర అసెంబ్లీ కార్యదర్శి ఎవరు?

Published Sun, May 25 2014 1:24 AM

who will be the Assembly Secretary of seemandhra?

అర్హులు లేని వైనం... డెప్యుటేషనే మార్గం
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి కార్యద ర్శిగా ఎవరుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కార్యదర్శి ఎస్.రాజ సదారాం పదవి కాలం ఇప్పటికే ముగిసినా అసెంబ్లీ సచివాలయంలో అర్హులెవరూ లేకపోవడంతో గత ప్రభుత్వం ఆయనకు పొడిగింపు ఇవ్వడం తెలిసిందే. జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలు వేరవుతున్నాయి. సదారాం తెలంగాణకు చెందిన వారు గనుక ఆయన్ను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగించే అవకాశముంది. దాంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిపై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఆ పదవిలోకి వచ్చేవారు న్యాయశాస్త్రంలో పట్టభద్రులై ఉండాలి. సంయుక్త కార్యదర్శి, అదనపు కార్యదర్శులకు కూడా ఇది వర్తిస్తుంది. కానీ అసెంబ్లీ సచివాలయంలో న్యాయశాస్త్ర పట్టభద్రులు ప్రస్తుతం డిప్యూటీ సెక్రెటరీ స్థాయిలోనే ఉన్నారు. వారికన్నా సీనియర్లకు న్యాయశాస్త్ర పట్టా లేని కారణంగా సంయుక్త, అదనపు కార్యదర్శులుగా పదోన్నతి లభించడం లేదు. దాంతో అసెంబ్లీలో ఆ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ కారణంగా కార్యదర్శి పదవికి అర్హులెవరూ లేకుండా పోయారు. 1970ల్లో ఇలాంటి పరిస్థితే ఎదురైతే న్యాయ శాఖ నుంచి ఒక అధికారిని డెప్యుటేషన్‌పై అసెంబ్లీ కార్యదర్శిగా తీసుకున్నారు. ఇప్పుడూ అదే విధానాన్ని అవలంబించక తప్పని పరిస్థితి నెలకొంది.
 
 అసెంబ్లీ ఉద్యోగుల స్థానికతపై వివాదం
 
 అసెంబ్లీలో ఉద్యోగుల స్థానికతపై వివాదం తలెత్తింది. అసెంబ్లీ సచివాలయ ఉద్యోగుల విభజన జరగాల్సి ఉన్న నేపథ్యంలో వారి స్థాయీ నివేదికను అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. అయితే అందులో 22 మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ వారిగా క్లెయిమ్ చేసుకుంటున్నారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నలుగురు సభ్యులతో కమిటీని కార్యదర్శి నియమించారు. అది శనివారం ఉద్యోగుల అభ్యంతరాలను పరిశీలించి నివేదిక ఇవ్వనుంది.

Advertisement
Advertisement