జూలో జిరాఫీల సందడి | Sakshi
Sakshi News home page

జూలో జిరాఫీల సందడి

Published Mon, Dec 23 2013 1:09 AM

జూలో జిరాఫీల సందడి - Sakshi

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇన్నాళ్లు నైట్‌క్రాల్‌లో ఉన్న జిరాఫీలు ఆ బందిఖాన నుంచి విడుదలయ్యాయి. తమకు కేటాయించిన ఎన్‌క్లోజర్లోకి వచ్చి ఊపిరిపీల్చుకున్నాయి. హుషారుగా ఎన్‌క్లోజర్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. సందర్శకులకు కనువిందు చేశాయి. రాష్ట్ర అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆదివారం జూలో వాటి మోటో వద్ద పచ్చ జెండా ఊపి సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టారు. దీంతో దాదాపు 20 రోజులుగా వాటిని చూడడానికి సందర్శకులు చేస్తున్న నిరీక్షణ ఫలించింది.

విశాలమైన ఎన్‌క్లోజర్ చుట్టూ అవి సందడిగా తిరుగుతూ చెట్టుకొమ్మలను అందుకొని ఆకులు తింటూ సందర్శకుల అలరించాయి. జిరాఫీలను ఎన్‌క్లోజర్‌లో విడుదల చేసిన అనంతరం  మంత్రి ఖడ్గమృగం, హంసలను కూడా అధికారికంగా సందర్శకుల కోసం విడిచిపెట్టారు. ఖడ్గమృగాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో కాన్పూర్ నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన విషయం విదితమే. ఇది బాగా అల్లరి చేయడంతో జూ అధికారులు సుమారు నాలుగు నెలల పాటు ముసుగులో ఉంచాల్సి వచ్చింది. అప్పటి నుంచి దీన్ని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి తరలించారు. సందర్శకుల కోసం సుమారు రెండు నెలల క్రితం విడిచి పెట్టారు. మళ్లీ ఆదివారం అధికారికంగా మంత్రి చేతులు మీదుగా దీన్ని ప్రారంభించారు.
 
డాల్ఫినోరియం రద్దు..

కొన్నాళ్లుగా ప్రతిపాదనలో ఉన్న డాల్ఫినోరియం ఏర్పాటు రద్దయిందని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తెలిపారు. జూను సందర్శించిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ డాల్ఫినోరియంను జూ పక్కనే సముద్రం ఒడ్డున ఏర్పాటు చేయదలిచామని, అయితే దీనికి మెరైన్ శాఖ అభ్యంతరం పెట్టడంతో ఆ ప్రతిపాదనను అటవీశాఖ రద్దు చేసుకొందని వివరించారు. మూడేళ్లుగా జూ పార్కు బాగా అభివృద్ధి చెందిందన్నారు. అటవీశాఖలో కొత్తగా 3800 ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని, కొద్ది కోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని వెల్లడించారు.
 

Advertisement
Advertisement