ఎక్కడి పనులు అక్కడే | Sakshi
Sakshi News home page

ఎక్కడి పనులు అక్కడే

Published Tue, Feb 25 2014 11:56 PM

work is not moving

 రేపటినుంచే ఏడుపాయల జాతర
 అంతా అస్తవ్యస్తం
 గుంతలమయంగా రోడ్లు..
 సా..గుతున్న స్నానఘాట్లు
 మొద్దునిద్రలో అధికారులు
 కలెక్టర్ ఆదేశించినా చలనంలేని వైనం
 పాపన్నపేట, న్యూస్‌లైన్:
 పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది ఏడుపాయల జాతర పరిస్థితి. జాతర ముహూర్తం దగ్గర పడుతున్నా అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. 15 రోజుల ముందే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించినా.. తాజాగా కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించినా జాతర పనులు ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారుల పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ఏడుపాయల కమాన్, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల ఏడుపాయల ఆలయం వరకు సింగిల్ రోడ్డు ఉంది. ఇది పూర్తిగా శిథిలం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతరకు వేలాది వాహనాలు, లక్షలాది భక్తులు తరలి రానుండటంతో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న గోతులను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ. 50 వేలు కేటాయించారు. గురువారం నుంచే జాతర ప్రారంభం అవుతున్నా ఇంకా పనులు పూర్తి కాలేదు.
 
  ఇరుపక్కల చెట్లతో అనేక వంకలు తిరిగిన ఈ రోడ్డుపై సాధారణ సమయాల్లోనే ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుంది. సాయంత్రం వరకూ విద్యుత్ శాఖ అధికారులు స్తంభాల పక్కన గల చెట్లనునరికేస్తూనే ఉన్నారు. విద్యుత్ సరఫరాలో పలుమార్లు అంతరాయం ఏర్పడుతుండటంతో జాతరలో తాగునీటి సరఫరా ఆగిపోయింది. కనీసం టాయిలెట్లకు నీరురాక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానఘాట్ల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఘనపురం ఆనకట్ట వద్ద విడుదల చేసిన నీరు వేగంగా వచ్చే అవకాశం ఉన్నందున అప్పుడే నిర్మించిన స్నానఘాట్లు ఏమేరకు తట్టుకుంటాయోనని భక్తులు వాపోతున్నారు.
 
  ఘనపురం ఆనకట్ట అవతల చిన్నఘనాపూర్ వైపు రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని, భక్తులు ఆరోపిస్తున్నారు. కాగా పంచాయతీ సిబ్బంది ఇంకా విధుల్లో చేరక పోవడంతో ఏడుపాయల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా పేరుకు పోయాయి. ఇప్పటికే వేలాది మంది భక్తులు ఏడుపాయలకు చేరుకుని ఇబ్బందుల పడుతున్నారు.  జాతరలో ఎలాంటి అసౌకర్యాలు కలిగినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించినా పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పీఆర్ డిప్యూటీ ఈఈ నర్సింలు మాట్లాడుతూ  ట్రాక్టర్లు దొరకక రోడ్డు పనులు పూర్తి కాలేదని, త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. ఇన్సులేటర్లు పగిలిపోవడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.
 
 

Advertisement
Advertisement