పాతగుట్టకు బ్రహ్మోత్సవ శోభ | Sakshi
Sakshi News home page

పాతగుట్టకు బ్రహ్మోత్సవ శోభ

Published Wed, Feb 5 2014 4:04 AM

yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple celebrations

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధీనంలోని పాతగుట్ట.. బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఆలయాన్నిరంగులు, విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
 - న్యూస్‌లైన్, యాదగిరికొండ
 
 పాతగుట్ట బ్రహ్మోత్సవాలకు దేవస్థానం అధికారులు నాలుగు రోజులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు.  సుమారు 3000 కరపత్రాలు ముద్రించి దాతలకు పంపిణీ చేశారు. 3000 వాల్ పోస్టర్లు ముద్రించి సుదూర ప్రాంతాలకు పంపించారు. ఆలయానికి, విష్ణు పుష్కరిణికి వెళ్లే దారిలోని మెట్లకు సున్నం, రంగులు, జాజు వేశారు. తాత్కాలికంగా చలువ పందిళ్లు వేయడమేగాక మంచినీటి సౌకర్యం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి కల్యాణం నిర్వహించనున్న స్థలాన్ని చదును చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు.
 
 50వేల లడ్డూ ప్రసాదం సిద్ధం
 సుమారు 50  వేల లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు సుమారు 20,000 మంది భక్తులు హాజరుకానున్నట్లు దేవస్థానం అధికారులు  అంచనా వేస్తున్నారు. కల్యాణం, రథోత్సవం నిర్వహించే రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసుల సహకారంతో తగిన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
 
 వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వినోదం కలిగించేందుకు గాను తగిన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా భరత నాట్యం, హరికథా కాలక్షేపం, బుర్రకథ, చిందు, యక్షగానం లాంటి  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో పారాయణాలు , హోమాలు , జపాలు చేసేందుకు గాను సుమారు 10 మంది అర్చకులను ప్రత్యేకంగా పిలిపిస్తున్నారు.
 
 ఆంజనేయస్వామికి కిలోన్నర
 వెండి కవచం బహూకరణ
 పాతగుట్టలోని గర్భాలయంలో గల ఆంజనేయ స్వామి వారికి కిలోన్నర వెండితో చేయించిన కవచాన్ని హైదరాబాద్‌లోని రామంతాపూరర్‌కు చెందిన జైపాల్‌రెడ్డి అనే భక్తుడు దేవస్థానం అధికారులకు బహూకరించారు. ఈ సందర్భంగా ఆ కవచాన్ని ఆంజనేయస్వామికి అలంకరించి ఆకుపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సంపతాచార్యులు, గట్టు వెంకటాచార్యులు, రాజమన్నార్, ఆలయ అధికారులు అశోక్ , గడసంతల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
 
 అధ్యయనోత్సవాల్లో జరిగే కార్యక్రమాలు
 పాతగుట్టలో బ్రహ్మోత్సవాలను పురస్కరిం చుకుని బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. వీటి నిర్వహణ కోసం ఆరుగురు అర్చకులను పిలిపిస్తున్నారు.
 
 బుధవారం ఉదయం 9 గంటలకు  తిరమంజనసేవ, రాత్రి 7గంటలకు  తోళక్కం,
 6 వ తేదీ ఉదయం 9గంటలకు తిరుమంజన సేవ, రాత్రి 7గంటల నుంచి దివ్యప్రబంధ సేవాకాలం
 
 7 వ తేదీ ఉదయం తిరుమంజన సేవ, రాత్రి పరమ పద ఉత్సవం
 8 వ తేదీ ఉదయం 8 గంటలకు చాత్మరతో అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.
 

Advertisement
Advertisement