యంత్రతంత్రం | Sakshi
Sakshi News home page

యంత్రతంత్రం

Published Thu, Feb 4 2016 1:20 AM

యంత్రతంత్రం - Sakshi

 విజయనగరం: పంటల్లో యాంత్రీకరణ ద్వారా మరింత మెరుగైన ఫలితాలొస్తాయని, రైతులకు లాభసాటి అవుతుందని ప్రభుత్వం యంత్ర పరికరాలను   రాయితీపై అందిస్తోంది. సగం ధరకే వస్తున్న యంత్రాలను కొనుగోలు చేసుకుని రైతులు ఆర్థికంగా లబ్ధిపొందుతారని ప్రభుత్వం భావించింది. కానీ,   ఆ యంత్ర పరికరాలపై కూడా టీడీపీ నేతల కన్ను పడింది. మిగతా వాటి  మాదిరిగానే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సిఫార్సు  లేఖలిచ్చారు.

అధికారులు సైతం వాటినే ప్రతిపాదించారు. ఇంకేముంది కలెక్టర్ వాటిని మంజూరు చేసేశారు. దాదాపు 19యూనిట్లు పచ్చ చొక్కాల  వశమయ్యాయి.  విషయం గుప్పు మనడంతో అధికార పార్టీలో కూడా ఆశావహులు ఎక్కువయ్యారు. లేఖలు, ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఇదేదో ఇబ్బందిగా తయారైందని భావించిన కలెక్టర్ ప్రస్తుతానికి  మంజూరు చేయడం  ఆపేసినట్టు సమాచారం. గ్రూపుగా దరఖాస్తుచేయాలి   స్పెషల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద వరి, మొక్కజొన్న, పత్తి, చెరుకు పంటలను సాగు చేయడానికి అవసరమైన ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, వరినాట్లు వేసే యంత్రాలు, మినీ ట్రాక్టర్లు, కోనో వీడర్లు, పవర్ వీడర్లు రైతులకు అందజేస్తారు.


పత్తి యంత్రాల యూనిట్‌కైతే వాస్తవ ధర రూ. 8లక్షల 22వేల 995. ఇందులో 50శాతం రాయితీ(4లక్షల 11వేల 497)పోను రూ. 4లక్షల 11వేల 498 చెల్లించాల్సి ఉంది. అలాగే మిగతా వేరుశనగ యూనిట్, వరి, చెరుకు, మొక్కజొన్న యంత్రాలను కూడా రాయితీపై ఇస్తారు. 50శాతం రాయితీ యూనిట్లు పొందాలంటే నలుగురి నుంచి ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడి ఉండాలి.   అలాంటి రైతు మిత్ర గ్రూపులు ముందుగా వ్యవసాయ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి.హడావిడిగా తయారవుతున్న మిత్రులుఇంతవరకు బాగానే ఉన్నా మంజూరు కొచ్చేసరికే గాడి తప్పింది. ఎప్పటి నుంచో గ్రూపుగా ఉన్న రైతుల్ని కాదని, రూ. లక్షల్లో వస్తున్న రాయితీతో వచ్చిన యంత్రాలను దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు కొంతమంది అప్పటికప్పుడు గ్రూపులను ఏర్పాటు చేసి  దరఖాస్తు చేసుకున్నారు.వాటికి తమ ఎమ్మెల్యేల లేఖలను జతపరిచారు. అంతేకాకుండా వారితో అధికారులకు ఫోన్ ద్వారా ఒత్తిళ్లు చేశారు.


ఇంకేముంది అధికారులు తూచ తప్పకుండా సిఫార్సులకు లోబడి ప్రతిపాదిత దరఖాస్తులను పంపించారు.అధికారుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కలెక్టర్ కూడా   ఇప్పటివరకు 19యూనిట్లు మంజూరు చేశారు. దాదాపు రూ. 82లక్షల రాయితీ విడుదల చేశారు. పేరుకే గ్రూపుగా చూపించినా లబ్ధిపొందింది మాత్రం ఒక్కొక్కరేనని విమర్శలు ఉన్నాయి. సిఫార్సులు లేని రైతుమిత్ర గ్రూపుల దరఖాస్తులు కనీసం పరిశీలనలోకి రాలేదని తెలుస్తోంది. మండల స్థాయిలోనే వాటిని తొక్కేశారు. ఒత్తిళ్లు పెరగడంతో ఆగిన మంజూరు
 రూ. లక్షల్లో వచ్చే రాయితీ పరికరాలు ఇస్తున్నారన్న ప్రచారం ఎక్కువవడంతో అధికార పార్టీ నేతల్లో కూడా పోటీ పెరిగింది.దరఖాస్తుల తాకిడి పెరిగింది. నేతలంతా రంగప్రవేశం చేసి ఎవరికి వారు ఒత్తిళ్లకు దిగడం, సిఫార్సుల లేఖలివ్వడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. తప్పని పరిస్థితుల్లో దాదాపు 32దరఖాస్తులను కలెక్టర్ ఆమోదం కోసం పంపించారు. కాకపోతే,  ఇదే సందర్భంలో బయటి నుంచి ఆరోపణలు ఎక్కువయ్యాయి. యూనిట్లు పక్కదారి పడుతున్నాయని, అర్హులైన గ్రూపులకు దక్కడం లేదన్న వాదనల నేపథ్యంలో కలెక్టర్ సందిగ్ధంలో పడ్డట్టు తెలిసింది. తొలుత ఇచ్చిన 19 యూనిట్లతోనే ఆపేశారు.


ఇదేదో తలనొప్పిగా ఉందని తదుపరి మంజూరు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఇదే విషయమై వ్యవసాయ శాఖ జేడీ లీలావతి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వ్యవసాయ అధికారి, అసిస్టెంట్ డెరైక్టర్‌ల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకే కలెక్టర్ మంజూరు చేశారని చెప్పారు. లబ్ధిపొందిన వారు తమ యూనిట్లను అద్దెకివ్వకపోతే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.

Advertisement
Advertisement