ఆదరించిన జిల్లాకు ఏం చేశావ్‌ బాబూ? | Sakshi
Sakshi News home page

ఆదరించిన జిల్లాకు ఏం చేశావ్‌ బాబూ?

Published Wed, Jun 13 2018 7:11 AM

YS Jagan Fires On Chandrababu In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, రాజమహేద్రవరం: ‘తూర్పుగోదావరి జిల్లాలో 2014 ఎన్నికల్లో 19 అసెంబ్లీ స్థానాలకు 14 స్థానాల్లో టీడీపీని గెలిపించారు. మరో ముగ్గురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనుగోలు చేశావ్‌. ఈ జిల్లా నుంచి టీడీపీకి 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు. ఇంతగా ఆదరించిన జిల్లాకు నాలుగేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలి’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌ పాల్‌చౌక్‌లో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ సీఎం చంద్రబాబు పరిపాలనా తీరును ఎండగట్టారు. పుష్కరాల పేరుతో 2000 కోట్ల రూపాయల పనులను నామినేషన్‌పై తన బినామీకి కట్టబెట్టి దోచుకున్నారని మండిపడ్డారు.

సినిమాల్లో హీరోలాగా కనపడాలని పుష్కరాల్లో షూటింగ్‌ తీయించి 29 మంది చావుకు కారణమయ్యారని, ఆనాటి ఘటనను గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి, ఎంపీ మురళీమోహన్‌లతో కలసి గోదావరి తీరంలో ఇసుక దోపిడీ చేస్తూ పెదబాబు, చినబాబు వాటాలు పంచుకుంటున్న తీరును ఎండగట్టారు. పొక్లెయిన్లు, యంత్రాలతో గోదావరిలో జరుగుతున్న తవ్వకాలను ప్రస్తావించి నదికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రాజమహేంద్రవరంలోని ఆవ ప్రాంతంలో 36 ఎకరాలు సేకరించి 26 ఎకరాల్లో ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. మిగిలిన 10 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయగా వాటినీ ఆక్రమించారని మండిపడ్డారు. కొత్తగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన పాలకులు ఆ పని చేయకుండా తిరిగి పేదల స్థలాలను లాక్కుంటున్నారని ప్రస్తావించడంతో ప్రజలు ‘అవును.. అవును..’ అంటూ చేతులు పైకెత్తారు. చదరపు అడుగు రూ.1000 అయ్యే ఫ్లాట్లకు రూ.2000 చొప్పున తీసుకుంటూ లంచాలు మెక్కుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తీసుకున్న లంచాలకు ఫ్లాట్లు తీసుకున్న వారు నెల నెలా రూ.3000 చొప్పున 20 ఏళ్ల పాటు బ్యాంకులకు కట్టుకుంటూ పోవాలా? అని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌ మనందరి ప్రభుత్వం వచ్చాక బ్యాంకు అప్పు రూ.3 లక్షలు మాఫీ చేస్తానని ప్రకటించడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ప్రజల గుండెల్లో నిలవాలన్నదే నా ఆకాంక్ష
తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిలా ప్రజల గుండెల్లో నిలవాలన్నదే తన ఆంకాక్ష అని జగన్‌ పేర్కొన్నారు. 2004 ఎన్నికల్లో తన తండ్రిని ఆదరించిన తూర్పుగోదావరి జిల్లా ప్రజలు 21 అసెంబ్లీ సీట్లకు 18 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. మీ దీవెనలకు గుర్తుగా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయా పనులను వివరించారు. రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ, వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాకినాడలో జేఎన్‌టీయూ బ్రాంచ్‌ యూనివర్సిటీని ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. పోలవరం ఎడమ, కుడి కాలువలు దాదాపు పూర్తి చేశారని గుర్తు చేశారు. రూ.3 వేల కోట్లతో గోదావరి డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు చేశారని పేర్కొన్నారు. గోదావరిపై నాలుగో బ్రిడ్జి తన తండ్రి వైఎస్‌ హయాంలోనే వచ్చిందన్న విషయం ప్రస్తావించారు.

మధురపూడి విమానాశ్రయం ఆధునికీరణ పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. తన తండ్రిలాగే జిల్లా రుణం తీర్చుకునేందుకు ఆశీర్వదించాలని కోరారు. వైఎస్‌ జగన్‌ ప్రసంగం ముగిసిన తర్వాత మైకుల్లో ‘వచ్చాడయ్యో సామి.. నింగి చుక్కల్ని కలిపింది భూమి..’ అనే పాట పెట్టడంతో యువత నృత్యాలు చేసింది. వాహనం దిగిన తర్వాత వైఎస్‌ జగన్‌తో కరచాలనం చేసేందుకు యువకులు, పెద్దలు ఎగబడ్డారు. సభానంతరం జననేత జగన్‌ జోరు వానలోనే ప్రజలతో మమేకమై పాదయాత్రగా రైల్వే స్టేషన్‌ మీదుగా ఆత్రేయపురం మండలం పేరవరం రాత్రి బసకు చేరుకున్నారు. 

Advertisement
Advertisement