పులివెందులలో జన జాతర | Sakshi
Sakshi News home page

పులివెందులలో జన జాతర

Published Sun, Nov 10 2013 2:18 AM

పులివెందులలో జన జాతర - Sakshi

20 నెలల తర్వాత స్వస్థలానికి వైఎస్ జగన్
చూడడానికి పోటెత్తిన అభిమాన సందోహం
 
 సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో శనివారం పులివెందుల జన జాతరను తలపించింది. అక్రమ నిర్బంధంతో జైల్లో ఉన్న నేపథ్యంలో దాదాపు 20 నెలల తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి స్వస్థలంలో అడుగుపెట్టారు. ఆయన్ను చూడ్డానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చాలామంది అభిమానులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో జాగారం చేశారు. ఉదయం 6.20 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వైఎస్ జగన్, ఆయన భార్య భారతి దిగగానే  ‘జై జగన్’ నినాదాలతో రైల్వేస్టేషన్ హోరెత్తింది. తనను చూసేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలకు జగన్‌కు అభివాదం చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు, ఆటోగ్రాఫ్‌లకు అభిమానులు పోటీపడ్డారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి, వైకోడూరు, పెద్దనపాడు, ఉరుటూరు, వీరపునాయునిపల్లి మీదుగా వేంపల్లికి చేరుకున్నారు.

మార్గమధ్యంలో తనకోసం రోడ్లపై వేచి ఉన్న జనసందోహానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తర్వాత ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌కు చేరుకొని దివంగత నేతకు నివాళులర్పించారు. అప్పటికే జగన్‌ను చూసేందుకు ఇడుపులపాయకు భారీగా ప్రజలు తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి 11.30 గంటలకు పులివెందులకు బయలుదేరారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement