జగన్ సీఎం కావడమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

జగన్ సీఎం కావడమే లక్ష్యం

Published Mon, Feb 10 2014 1:14 AM

ysr congress party activists Target  cm  ys jagan mohan reddy

 గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ :ప్రజాసంక్షేమమే లక్ష్యంగా... సమైక్య రాష్ట్ర పరిరక్షణే ధ్యేయంగా.. అవిరళ కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేవరకూ ప్రతి పార్టీ కార్యకర్తా నిర్విరామ కృషి చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం గుంటూరు శివారులోని పెదపలకలూరు గ్రామంలో గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల పార్టీ నేతలు, సమన్వకర్తలు, కార్యకర్తలతో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనం పెరిగి కాంగ్రెస్, టీడీపీల్లో గుబులు మొదలైందనీ, ఈ నేపథ్యంలోనే వారు కుతంత్రాలకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని ముందునుంచి పోరాడుతున్న నాయకుడు జగన్ ఒక్కరేననీ, మిగిలినవారు కేవలం నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. 
 
 పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమారెడ్డి వేంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాల వారి జీవితాలలో వెలుగులు నిండే రోజులు దగ్గర్లో ఉన్నాయని అన్నారు. గుంటూరు పార్లమెంట్ నుంచి బాలశౌరిని అత్యధిక మెజార్టీతో గెలిపించే భాధ్యత ఆయా నియోజక వర్గాల సమన్వయకర్తలదే అని సూచించారు. ప్రత్తిపాడు నియోజక వర్గ ఎమ్మెల్యే మేకతొటి సుచరిత మాట్లాడుతూ అధికార పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందనీ, కేవలం పదవులు కాపాడుకునేందుకే సమయమంతా సరిపోతోందని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్ మాట్లాడుతూ రాష్ర్టంలో వైఎస్ ఆశయాలను నేరవెర్చగల ఏకైక నాయకుడు జగనేనని చెప్పారు. 
 
 అందరూ కలసికట్టుగా నిలిచి ఆయన్ను సీఎంగా నిలపాలని కోరారు. పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్యయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ, ప్రజా సంక్షేమంకోసం పాటుపడుతున్న జగనన్న బాటలోనే అందరూ నిలవాలని సూచించారు. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాల సమన్వయ కర్తలు లేళ్ళ అప్పిరెడ్డి, షౌకత్, నసీర్ అహ్మద్, రావి వెంకటరమణ, మంద పాటి శేషగిరిరావు, కొల్లిపరరాజేంద్రప్రసాద్, కత్తెర సురేష్, ఈపూరు అనూప్, కిలారి రోసయ్య, అన్నబత్తుని శివకుమార్, అన్ని విభాగాల నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement