Sakshi News home page

వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి

Published Mon, Sep 29 2014 2:42 AM

వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి

ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
 
 అనుమసముద్రంపేట : పార్టీలకు అతీతంగా పేద, బడుగు, బలహీనవర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించి వారి మదిలో శాశ్వతంగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలా ప్రస్తుత ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. శ్రీకొలను గ్రామంలో బోయిళ్ల పద్మజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలో రెండు రోజుల పాటు పర్యటించామని, అనేక సమస్యలతో పాటు ప్రధానంగా సాగు,తాగునీటి గురించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి తెచ్చారన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. మండలంలోని గుడిపాడు చెరువు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఐదు టీఎంసీల నీటిని ఉత్తర కాలువకు విడుదల చేస్తే కాలువ పరిధిలోని 20 చెరువులకు నీరు అందుతాయన్నారు. దీంతో వేలాది ఎకరాలకు సాగునీరు సాధ్యమవుతుందన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవని అన్నారు. ప్రధానంగా రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరేవన్నారు. చంద్రబాబు కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించకుండా అన్నీ నెరవేర్చాలన్నారు. వైఎస్సార్ గొప్ప మానవతావాది అని, అర్హులందరికి ఆయన ఆరోగ్యశ్రీ, పక్కాగృహాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, తదితర మహత్తర పథకాలను ప్రవేశపెట్టి అందరివాడు అయ్యారన్నారు. ప్రస్తుత ప్రజానాయకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలన్నారు. భవిష్యత్ వైఎస్సార్‌సీపీదేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జెడ్పీటీసీ కుదారి హజరత్తమ్మ, సొసైటీ చైర్మన్ నారసింహారెడ్డి, మహిళా నాయకులు పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ, ఆత్మకూరు నాయకులు దేవరపల్లి శ్రీనివాసులు రెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, తూమాటి దయాకర్ రెడ్డి, తూమాటి శశిధర్ రెడ్డి, షాజుద్దీన్, వెంకటేశ్వర్లు రెడ్డి, ఇందూరు రాజారెడ్డి పాల్గొన్నారు.


 

Advertisement

What’s your opinion

Advertisement