అభివృద్ధే అజెండా | Sakshi
Sakshi News home page

అభివృద్ధే అజెండా

Published Mon, Apr 14 2014 4:11 AM

అభివృద్ధే అజెండా - Sakshi

చెప్పలేనంతమంది రైతుల వేదనను కళ్లార చూసిన అనుభవం... లెక్కలేనన్ని పూరిగుడిసెల్లోకి వెళ్లి పేదరికంతో మాట్లాడివచ్చిన వైనం...గుప్పెడు మెతుకుల కోసం అవ్వ  ఆరాటం ..కరెంటు కోసం అన్నదాత నిట్టూర్పు...కన్నీటిరోదనలు..కష్టాల కడగళ్లు నేటికీ మదిలో కదలాడుతున్నాయి. తనను ప్రేమించే ప్రజలను ఇలాంటి కష్టాలనుంచి శాశ్వతంగా గట్టెక్కించాలనే ‘ప్రజానాయకుడి’ సంకల్పం ఎంత ధృడమైందో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో చెబుతోంది.

రైతన్న కన్నీటిని శాశ్వతంగా తుడవడం...నిరుద్యోగులకు ఉద్యోగంతో భరోసా ఇవ్వడం..పారిశ్రామికరంగం అభివృద్ధి కోసం జిల్లాలో స్టీల్‌ప్లాంట్....ఏరోగం వచ్చినా జిల్లా దాటకుండా సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్...వందరూపాయలకే 150 యూనిట్ల వరకూ ఇంటికి కరెంటు...పగటిపూట రైతులకు 7గంటల ఉచితవిద్యుత్...మహిళలను ఆర్థికకష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఐకేపీ రుణాల మాఫీ...ఇలా ఒక్కటి కాదు...

రెండు కాదు...జగన్ పదేపదే చెబుతున్న ‘స్వర్ణయుగపు’ కాంతుల వెలుగులు కనిపించేలా...ఆచరణ సాధ్యమైన హామీలతో, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రైతన్నక్షేమం లక్ష్యంగా అన్నివర్గాల ప్రజ భరోసానిస్తూ...కొత్తరాష్ట్రంలో సరికొత్త అభివృద్ధికి బాటలు వేసేలా రూపొందించిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిజమైన అభివృద్ధిని కాంక్షించే నాయకుడికి ఇలాంటి ‘విజన్’ ఉంటేనే ‘నవలోకం’ సాధ్యమవుతుందని విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు.
 
‘స్వర్ణయుగపు’ఆకాంక్షలకు అద్దం పడుతూ వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో
వ్యసాయం, ఉద్యోగం, సంక్షేమ పాలనే ధ్యేయంగా రూపొందించిన వైనం
వ్యవసాయ అనుబంధరంగాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
వైఎస్సార్‌జిల్లాలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు...సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి
వందరూపాయలకే 150 యూనిట్ల కరెంటు...2019కి విద్యుత్‌కోతలు లేని రాష్ట్రం
రూ.20వేలకోట్ల డ్వాక్రారుణాలు మాఫీ..రైతులకు పగటిపూట 7గంటల ఉచితవిద్యుత్
అన్నివర్గాల నుంచి ‘భేష్’ అనిపించుకుంటున్న మేనిఫెస్టో
 
 సాక్షి, కడప: ముక్కలైన రాష్ట్రంలో ఆర్థిక చిక్కులను అధిగమించి...ఆదాయాన్ని రాబడుతూ... కొత్తరాష్ట్రాన్ని అభివృద్ధిచేసేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆచరణ సాధ్యంకాని హామీలతో రూపొందిన కొన్నిరాజకీయపార్టీల ‘మోసపుఫెస్టోల’ను నిశితంగా గమనించి...ఆచరణ సాధ్యమైన హామీలతో అందరికీ ఆమోదయోగ్యమైన హామీలను జగన్ ‘ప్రమాణపుస్తకం’లో పొందుపరిచారు.

 వ్యవసాయం...అనుబంధరంగాలపైనే  ప్రధాన దృష్టి
 వ్యవసాయం లాభసాటిగా మారాలంటే దారి  అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని కాంక్షించారు. రైతులకు పగటిపూట 7గంటల నాణ్యమైన ఉచితవిద్యుత్‌ను అందించి, గిట్టుబాటు ధరకోసం 3వేలకోట్లరూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసేందుకు మాట ఇచ్చారు.

తెగుళ్లు, భూసార పరీక్షలులాంటి సమస్యలు పరిష్కరించేందుకు 108 తరహాలో 102 మొబైల్‌వ్యాన్ల ద్వారా పొలంలోకి శాస్త్రవేత్తలను, 103 వాహనంతో పశువుల డాక్టర్లను ఊళ్లోకి రప్పించనున్నారు. 2019కి విద్యుత్‌కోతలు లేకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ‘కరెంటుకోతలు’లేని రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నారు. ఇదే జరిగితే వ్యవసాయానికి తిరుగుండదని రైతన్నలు సంబరపడుతున్నారు.

రెండుజిల్లాలకో వ్యవసాయకళాశాల, జిల్లాలో వ్యవసాయం క్షేత్రం స్థాపించనున్నారు. ‘సెప్పినా  సేయలేని 1.27లక్షల కోట్ల రుణమాఫీ కంటే సెప్పిందిసేసే ఈ హామీలే శానాబాగుండాయి’ అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై కూడా జగన్ ప్రత్యేకదృష్టి సారించనున్నారు.

 నిరుద్యోగులకు భరోసా:
 ‘ఫలానా వాడు మానాయకుడు అని ప్రతి యువకుడు కాలర్ ఎగరేసి చెప్పాలి’’ అని జగన్ చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆ నాయకుడు తనే అని మేనిఫెస్టోలో చెప్పకనే చెప్పారు. జిల్లాలో  స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో పెట్రోకెమికల్ యూనివర్శిటీని స్థాపించనున్నారు. టాప్‌క్లాస్ మల్టీనేషనల్ కంపెనీలను  తీసుకొచ్చి తద్వారా భారీగా ఉద్యోగాలు కల్పించనున్నాడు.

 అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేందుకు పారిశ్రామిక కారిడార్‌ను రూపొందించనున్నారు. ప్రతి  గ్రామం, వార్డులో ప్రభుత్వ కార్యాలయాన్ని తెరిచి ఎలాంటి కార్డులైనా 24 గంటల్లో ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీని ద్వారా కూడా భారీగా ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 ఉద్యోగులకు పక్కా ఇళ్లు:
 చంద్రబాబు నాయుడు హయాంలో  ఉద్యోగులకు 16శాతం పీఆర్ ఇస్తే...వైఎస్ హయాంలో 39శాతం ఇచ్చారు. వైఎస్‌లాగా తాను కూడా ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధచూపిస్తానని జగన్ పేర్కొన్నారు. అర్హత ఉన్నకాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. నెలజీతాలతో సొంత ఇళ్లు కూడా కట్టుకోలేని ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రకటనతో సంబరపడిపోతున్నారు. జగన్‌కు అండగా ఉంటామని చెబుతున్నారు.

  సంక్షేమ పాలనే లక్ష్యం
 మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆర్థికకష్టాల నుంచి మహిళలను బయటపడేసేందుకు ఐకేపీ రుణాలను మాఫీ చేయనున్నారు. ఆపై వడ్డీలేని రుణాలను అందించనున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులను పూర్తిగా తొలగించనున్నారు.

‘అమ్మఒడి’ ద్వారా పిల్లల చదువుకోసం ఒకరికైతే 500, ఇద్దరికైతే వెయ్యి రూపాయలు తల్లి అకౌంట్‌లో వేయనున్నారు. ప్రతి స్కూలులో ఇంగ్లీషుమీడియం భోదించనున్నారు. విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించున్నారు.

 60 ఏళ్లకే పింఛన్, ప్రతి నియోజకవర్గంలో వృద్ధ, అనాథాశ్రమాలను ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా పేదరికాన్ని దూరం చేసి ప్రతి ఒక్కరి అభివృద్ధికి ప్రభుత్వం చేదోడుగా ఉండేలా జగన్ చర్యలు తీసుకున్నారు. సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడంపై మహిళలు, పేదలతో పాటు అన్ని వర్గాల నుంచి ప్రశసంలు అందుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement