వైఎస్సార్‌ సీపీ నుంచి గౌతంరెడ్డి సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నుంచి గౌతంరెడ్డి సస్పెన్షన్‌

Published Mon, Sep 4 2017 1:09 AM

వైఎస్సార్‌ సీపీ నుంచి గౌతంరెడ్డి సస్పెన్షన్‌ - Sakshi

పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం  
- వంగవీటి రంగా సహా పార్టీ నేతలపై వ్యాఖ్యల పర్యవసానం
 
సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, విజయవాడ/ఇబ్రహీంపట్నం: దివంగత వంగవీటి రంగాతో పాటు పార్టీ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు పి.గౌతంరెడ్డిని వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గౌతంరెడ్డి సస్పెన్షన్‌ తక్షణం అమలులోకి వస్తుందని ప్రకటించారు. గౌతంరెడ్డి ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని జగన్‌ ఆదేశించారు. కడప పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన జగన్‌.. పార్టీ నేతలతో సమావేశమై చర్చించి గౌతంరెడ్డిని సస్పెండ్‌ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి.  
 
రంగాపై వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ ఖండన
గౌతంరెడ్డి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత వంగవీటి రంగా, ఆయన సోదరుడు రాధాకృష్ణలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి తెలిపారు. పార్టీ నేత మల్లాది విష్ణుపై కూడా గౌతంరెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలనూ ఖండిస్తున్నామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గౌతంరెడ్డి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమోలు విడుదలయ్యాయని, వాటిలో ఆయన అభ్యంతరకరంగా మాట్లాడినట్లు పార్టీ దృష్టికి వచ్చిందన్నారు. వైఎస్‌ జగన్‌ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారన్నారు.

రంగాను ఉద్దేశించి గౌతం చేసిన వ్యాఖ్యలన్నీ ఆయన వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీలో ఏస్థాయి నాయకుడైనా సరే ఏ వ్యక్తి గురించి గాని, ఏ వర్గం గురించిగాని అనుచిత వ్యాఖ్యలు చేసినా, కించపరిచేలా మాట్లాడినా తీవ్రంగా పరిగణిస్తామని జగన్‌ హెచ్చరించినట్లు పార్థసారథి తెలిపారు. గౌతంరెడ్డి ఇంటర్వ్యూను ప్రసారం చేయబోయే టీవీ చానెల్‌.. తమ పార్టీ అభిప్రాయం కూడా తీసుకోవాలని కోరుతున్నామన్నారు.  
 
విజయవాడలో ఉద్రిక్తత..: సత్యనారాయణపురంలోని గౌతంరెడ్డి ఇంటి ముందు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ అనుచరులు ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. పోలీసులు వారిని నిలువరించారు. తన తండ్రిపై గౌతంరెడ్డి వ్యాఖ్యలకు ఖండనగా ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు వంగవీటి రాధాకృష్ణ ఇంటినుంచి బయలుదేరగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. రాధాతో పాటు ఆయన తల్లి రత్నకుమారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రత్నకుమారి సొమ్ముసిల్లి పడిపోయారు.

ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన రాధాకృష్ణను పోలీసులు అడ్డుకుని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించారు. కాసేపటికి తేరుకున్న రత్నకుమారి, రాధాకృష్ణను ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడంతో రాధాకృష్ణ, రత్నకుమారి పోలీస్‌స్టేషన్‌లోనే బైఠాయించి నిరసన తెలిపారు. రాధాకృష్ణ, రత్నకుమారిలను ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ నుంచి రాత్రి 9.45 గంటల సమయంలో విడుదల చేశారు. కాగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు గానూ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement