రగడ | Sakshi
Sakshi News home page

రగడ

Published Sun, Aug 3 2014 3:32 AM

Zilla Parishad Standing Committee election

జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అధికారగర్వంతో వ్యవహరించింది.
 ఆధిపత్యం కోసం రభస సృష్టించింది. ఏకగ్రీవంగా జరగాల్సిన స్థాయి కమిటీ ఎన్నికల్లో అనవసర రాద్ధాంతాన్ని సృష్టించింది.రగడకు దిగి ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. చివరకు భంగపాటుకు గురైంది.
 
 సాక్షి, కడప : కడప జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 11 గంటలకు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి ఆధ్వర్యంలో సీఈఓ మాల్యాద్రి స్థాయి సంఘాల ఎన్నికల నిబంధనలను సభ్యులకు వివరించారు. ఎలా వ్యవహరించాలో చెబుతూ, చైర్మన్లు, సభ్యులను ఎన్నుకునే విధానాన్ని సైతం అందరికీ అర్థమయ్యేలా విశదీకరించారు. తరువాత సభను కొద్దిసేపు వాయిదా వేసి రెండు పక్షాల వారు ఎవరికి వారు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చించుకునేందుకు అవకాశం కల్పించారు. అంత వరకు అంతా సవ్యంగానే సాగింది. ఆ తరువాతే అడ్డమైన వాదనలకు దిగి గందరగోళం సృష్టించేందుకు టీడీపీ శ్రేణులు కారణమయ్యాయి.
 
 రెచ్చిపోయిన పోరెడ్డి ప్రభాకరరెడ్డి
 సమావేశంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులు మధ్యాహ్నం భోజనం అనంతరం స్థాయి సంఘాల ఎన్నికకు సంబంధించి జెడ్పీ చైర్మన్ రవి, సీఈఓ మాల్యాద్రి వేదికపై నుంచి మాట్లాడేందుకు ప్రయత్నించగా జెడ్పీటీసీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులను వెంట బెట్టుకొని వేదికపైకి దూసుకెళ్లారు. నిబంధనలు చెప్పకుండా ఎన్నికలు జరపడానికి వీల్లేదంటూ అభ్యంతరం లేవనెత్తారు.
 
 అక్కడే బైఠాయించారు. ఉదయం నుంచి ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ చైర్మన్, సీఈఓ ప్రశ్నిస్తుండగానే, వేదికపైనున్న ఎన్నికలకు సంబందించిన పత్రాలను పోరెడ్డి చించివేశారు. ఎంత చెప్పినా ఆయన వినకుండా ఎన్నిక ఆపాల్సిందేనంటూ పట్టుబట్టారు. అక్కడే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా పట్టించుకోలేదు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతలోనే ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జయరాములు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తదితరులు జోక్యం చేసుకున్నారు. ఇలా ప్రతిసారి అడ్డుతగలడం మంచిది కాదని చెప్పారు. అధికారం ఉందికదా అంటూ బలహీన వర్గాలకు చెందిన జెడ్పీ చైర్మన్, సీఈఓను బెదిరింపులకు గురి చేయడం తగదన్నారు.  
 
 జారుకున్న సీఈఓ మాల్యాద్రి
 సభలో పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎన్నిక పత్రాలు చించివేయగానే  సీఈఓ మాల్యాద్రి జారుకున్నారు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఆయన వేదికపై నుంచి నిష్ర్కమించడం అనేక విమర్శలకు తావిచ్చింది. అధికార పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వ చ్చిన నేపథ్యంలోనే సీఈఓ అవమానం పేరుతో అక్కడి నుంచి తప్పుకోవడాన్ని వైఎస్సార్ సీపీ సభ్యులు తప్పుబట్టారు. ఎన్నికల వేళ.. రాద్ధాంతం జరగ్గానే సీఈఓ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
 
  సీఈఓ వెళ్లిపోయాక కూడా చైర్మన్ హోదాలో రవి ఎన్నికను నిర్వహించేందుకు ప్రయత్నించగా టీడీపీ ప్రజాప్రతినిధులు మళ్లీ అడ్డుతగిలారు. దీంతో చైర్మన్ వెంటనే సీఈఓకు ఫోన్ చేసి ‘మీరెందుకు వెళ్లిపోయారు.. వెంటనే ఇక్కడి కి రండి’ అని కోరగా.. ‘నేను రాలేనంటూ’ సీఈఓ సమాధానం ఇవ్వడం విస్మయానికి గురి చేసింది. తిరిగి చైర్మన్ ఫోన్‌లో ‘ఎందుకు రాలేరంటూ’ ప్రశ్నించగా.. సీఈఓ నుంచి సమాధానం లేదు. దీంతో చైర్మన్ వెంటనే జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.  
 
 వాగ్వాదంతో సభ వాయిదా
 ఎన్నికను అడ్డుకోవాలని టీడీపీ, జరిపించాలని వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టడంతో ఒక దశలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. అధికార పార్టీ సభ్యుల దురాగతాలను అడ్డుకునేందుకు చైర్మన్ రవికి అండగా వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుదర్శన్‌రెడ్డి, సుదర్శనం, రామగోవింద్‌రెడ్డి, భూపేష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వీరారెడ్డి, ఇతర మహిళా సభ్యులు అండగా నిలిచారు.
 
 ఇది పద్ధతి కాదంటూ టీడీపీ సభ్యులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో సభ వాయిదా పడింది. దీంతో టీడీపీ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత సభ ప్రారంభం కావడం, డెప్యూటీ సీఈఓ బాలసరస్వతి సమక్షంలో చైర్మన్ రవి ఎన్నికలను నిర్వహించారు. అన్ని విభాగాలకు సంబంధించిన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement