పొందూరారు! | Sakshi
Sakshi News home page

పొందూరారు!

Published Wed, Nov 12 2014 4:07 AM

ZPTC member of the Chamber in the MPDO office

* ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యునికి చాంబర్
* నిబంధనలను కాలరాసిన జెడ్పీ సీఈవో
* పది రోజుల్లో నాలుగు లేఖలతో ఎంపీడీవోపై ఒత్తిడి
* పోటీ అధికార కేంద్రం ఏర్పాటుకు కుయుక్తులు
* వైఎస్సార్‌సీపీ ఎంపీపీపై కక్ష సాధింపునకేనన్న విమర్శలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా, నిబంధనలకు విరుద్ధంగా పొందూరు మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యుడికి ప్రత్యేకంగా చాంబర్ కేటాయించారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని పంచాయతీరాజ్ శాఖ 1995లోనే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మండల పరిషత్ అధికారిక కార్యకలాపాల్లో జెడ్పీటీసీలు జోక్యం చేసుకోరాదు. ఎంపీపీ, జెడ్పీటీసీ రెండూ వేర్వేరు రాజ్యాంగ విభాగాలు. వేటికవే అభివృద్ధి కాంక్షించే రాజ్యాంగ శక్తులుగా ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

పొందూరులో దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. పంచాయతీరాజ్ చట్టాన్ని పరిరక్షించాల్సిన జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్, పొందూరు జెడ్పీటీసీ లోలుగు శ్రీరాములునాయుడుతో కుమ్మక్కై ఆయనకు అనుకూలంగా కేవలం పది రోజుల వ్యవధిలోనే నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. జెడ్పీటీసీకి చాంబర్ కేటాయించాలని పొందూరు ఎంపీడీవో ఎంవీబీ సుబ్రహ్మణ్యానికి లేఖ రూపంలో ఆదేశించారు.

ఆయన దాన్ని అమలు చేశారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులూ పొందలేదని ఎంపీపీ సువ్వారి దివ్య ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకోవాలని సీఈవోకు ఆయన సూచించారన్నారు. అయినా ఫలితం లేదన్నారు. గత సెప్టెంబర్‌లో ఇదే విషయమై అక్కడి నేతలు ప్రభుత్వానికి స్పష్టత కోరుతూ లేఖ రాశారు. ఇది జరిగి రెండు నెలలవుతున్నా అటు జెడ్పీ సీఈవో, ఇటు ఎంపీడీవో స్పందించకపోవడం, జెడ్పీటీసీ చాంబర్ ఖాళీ చేయకపోవడంతో వివాదం ముదురుతోంది.
 
పది రోజుల్లో నాలుగు ఉత్తర్వులు
జెడ్పీటీసీ సభ్యుడికి చాంబర్ కేటాయింపు వెనక పెద్ద తతంగమే నడిచిందని తెలుస్తోంది. పొందూరు ఎంపీపీగా వైఎస్సార్‌సీపీకి సువ్వారి దివ్య ఎన్నికయ్యారు. దీన్ని సహించలేని టీడీపీ నాయకులు ఆమె అధికార విధులకు, అభివృద్ది కార్యక్రమాలకు ఆటంకం కల్పించేలా కుయుక్తులు పన్నుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే జెడ్పీ సీఈవోపై ఒత్తిడి తెచ్చి కేవలం పది రోజుల్లో నాలుగు ఉత్తర్వులిచ్చేలా చేశారు. కలెక్టర్ అనుమతి లేకుండా, చైర్‌పర్సన్‌ను తప్పుదోవ పట్టిస్తూ మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీకి చాంబర్ కేటాయింపజేసి రెండో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్న విమర్శలు తలెత్తుతున్నాయి.

ఇందుకోసం  ఆ గదిలో ఉన్న ఉపాధి హామీ పథకం రికార్డులన్నింటినీ అక్కడి ఐకేపీ కార్యాలయానికి తరలించారు. ఆ రికార్డులకేమైనా జరిగితే జవాబుదారీ ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  కార్యాలయంలో గది ఖాళీ ఉంటేనే జెడ్పీటీసీకి కేటాయించాలని ఉత్తర్వుల్లో సూచించినా అందుకు భిన్నంగా రికార్డులను తరలించి గది కేటాయించడం గమనార్హం.

ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిని కూడా జెడ్పీటీసీ తన వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంపీడీవో కార్యాలయంలోనే ఉన్న ఈ గది బయట తెలుగుదేశం రంగులు, స్టిక్కర్లు, చంద్రబాబు పోస్టర్లతోపాటు జెడ్పీటీసీ నేమ్ బోర్డు ఏర్పాటు చేసినా ఎంపీడీవో మాత్రం తామెవ్వరికీ గది ఇవ్వలేదని, ప్రస్తుతం అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పడం విడ్డూరం. ఈ వివాదంపై జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాట్లోకి రాలేదు.

Advertisement
Advertisement