Sakshi News home page

ఐదేళ్లలో రూ.280 లక్షల కోట్లు కావాలి

Published Mon, Sep 8 2014 12:51 AM

ఐదేళ్లలో రూ.280 లక్షల కోట్లు కావాలి

న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ సగటున 7% చొప్పున వృద్ధి సాధించాలంటే 4.7 లక్షల కోట్ల డాలర్ల(రూ. 280 లక్షల కోట్లు) పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పారిశ్రామిక సమాఖ్య సీఐఐ అభిప్రాయపడింది. గత ఐదేళ్లలో లభించిన పెట్టుబడులతో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా, ఇందుకు ద్రవ్య, ఆర్థిక, వాణిజ్య విధానాలను పునఃసమీక్షించాల్సి ఉందని ఒక నివేదికలో పేర్కొంది. సీఐఐ అంచనా ప్రకారం గత ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 2.9 ట్రిలియన్ డాలర్ల(రూ. 139 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకట్టుకుంది.

 పారిశ్రామిక రంగం కీలకం
 రానున్న ఐదేళ్ల కాలంలో పారిశ్రామిక రంగం సైతం సగటున 6.3% వృద్ధిని సాధించాల్సి ఉందని సీఐఐ అంచనా వేసింది. గత ఐదేళ్లలో సగటున వార్షికంగా 5.2% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. తాజా అంచనాలను అందుకోవాలంటే ఇందుకు రూ. 146 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరపడతాయని లెక్కకట్టింది. వీటిలో తయారీ రంగానికే రూ. 98 లక్షల కోట్లు అవసరమని నివేదికలో పేర్కొంది.

 తయారీ రంగం పుంజుకుంటే ఉద్యోగ కల్పన సైతం విస్తరిస్తుందని, తద్వారా పెరుగుతున్న ఉద్యోగార్థులకు పలు అవకాశాలు లభిస్తాయని వివరించింది. సర్వీసుల రంగం గత ఐదేళ్ల స్థాయిలోనే   8% చొప్పున దూసుకెళ్లాల్సి ఉందని నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు ఐదేళ్ల కాలంలో రూ. 98 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాల్సి ఉంటుందని తెలిపింది. అంచనా వేసిన విధంగా త యారీ రంగం పుంజుకుంటే, ఇది సర్వీసుల రంగానికి కూడా బదిలీ అవుతుందని వెల్లడించింది.

 ఆరోగ్యం, విద్య...: ఆరోగ్యం, విద్య, వాణిజ్యం, ఫైనాన్షియల్ సర్వీసులు, టూరిజం వంటి రంగాలలోనూ భారీ అవకాశాలున్నాయని, వీటిని వెలికితీయాల్సి ఉన్నదని సీఐఐ డెరైక్టర్ జనర ల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఇందుకు తగిన విధానాలు రూపొందించడం ద్వారా అనూహ్య వృద్ధిని సాధించవచ్చునని చెప్పారు. ఇక వ్యవసాయ రంగంపైనా దృష్టి కేంద్రీకరించాల్సి ఉన్నదని సీఐఐ నివేదిక అభిప్రాయపడింది. పూర్తిగా వర్షాలపై ఆధార  పడటంతో ఉత్పాదకత పడిపోతున్నదని తెలిపింది. రానున్న ఐదేళ్లలో వ్యవసాయ రంగం సగటున 4% వార్షిక వృద్ధిని అందుకోవలసి ఉందని పేర్కొంది. ఇందుకు రూ. 36 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకోవాలని తెలిపింది.

 మౌలిక సదుపాయాలు....
 మౌలిక సదుపాయాల రంగం విషయానికివస్తే పెట్టుబడులు రూ. 64.3 లక్షల కోట్లకు పెట్టుబడులు పెరగాల్సి ఉందని సీఐఐ నివేదిక పేర్కొంది. ఈ రంగానికి గత ఐదేళ్లలో రూ. 24 ల క్షల కోట్ల పెట్టుబడులు లభించాయని తెలిపింది. రానున్న ఐదేళ్ల కాలంలో మౌలిక రంగానికి లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరపడతాయని ప్రణాళికా సంఘం అంచనా వేయగా, వీటిలో 40% ప్రయివేట్ రంగం నుంచే సమకూర్చుకోవలసి ఉన్నదని సీఐఐ తెలిపింది.

Advertisement

What’s your opinion

Advertisement