హైదరాబాద్‌లో 4% తగ్గిన ఇళ్ల అమ్మకాలు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో 4% తగ్గిన ఇళ్ల అమ్మకాలు

Published Thu, Mar 6 2014 1:53 AM

హైదరాబాద్‌లో 4% తగ్గిన ఇళ్ల అమ్మకాలు - Sakshi

 న్యూఢిల్లీ: అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గతేడాది హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 4 శాతం క్షీణించి 16,500కి పరిమితమయ్యాయి. అయితే, తెలంగాణ ఏర్పాటు వల్ల అనిశ్చితి తొలగిపోవడంతో ఈ ఏడాది ఆఖరు నుంచి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమ్మకాలు మళ్లీ పుంజుకోనున్నాయి. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. 2012తో పోలిస్తే 2013లో నివాస గృహాల అమ్మకాలు 4 శాతం క్షీణించినట్లు వివరించింది. అలాగే, 2012లో 19,000 నూతన గృహాలు రాగా.. 2013లో ఇది 15 శాతం క్షీణించి 16,200కి పరిమితమైనట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అయినప్పటికీ, చెన్నై, పుణె వంటి ఐటీ నగరాలతో పోలిస్తే ఇక్కడ క్షీణత తక్కువేనని తెలిపింది.

 దేశంలోని మిగతా రెసిడెన్షియల్ మార్కెట్ల తరహాలోనే హైదరాబాద్‌లోనూ మందగమనం కనిపించిందని వివరించింది. ఆర్థిక మందగమనం, అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత.. వంటి అంశాలు అనిశ్చితికి కారణమయ్యాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. హైదరాబాద్‌లో గత రెండేళ్లుగా విక్రయాలు దాదాపు ఒకే స్థాయిలో ఉంటున్నా ధరల విషయంలో పెద్దగా మార్పుల్లేవని వెల్లడించింది. ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా తదితర టాప్ ఏడు నగరాల్లోని రెసిడెన్షియల్ మార్కెట్లలో ఇప్పటికీ హైదరాబాద్‌లో మాత్రమే అత్యంత అందుబాటు ధరల్లో గృహాలు లభిస్తున్నాయని తెలిపింది. 2009 నుంచి చూస్తే బెంగళూరు, పుణె, చెన్నై వంటి ఐటీ ఆధారిత మార్కెట్లలో సగటున ధరలు 38 శాతం మేర పెరగ్గా.. హైదరాబాద్‌లో 13 శాతం స్థాయిలోనే పెరుగుదల ఉందని నైట్ ఫ్రాంక్ నివేదికలో వివరించింది.

Advertisement
Advertisement