ఎంఎఫ్ ఇన్వెస్టర్లకు పేపర్ లెస్ ‘సిప్’..! | Sakshi
Sakshi News home page

ఎంఎఫ్ ఇన్వెస్టర్లకు పేపర్ లెస్ ‘సిప్’..!

Published Mon, Oct 10 2016 1:14 AM

ఎంఎఫ్ ఇన్వెస్టర్లకు పేపర్ లెస్ ‘సిప్’..!

దీపావళికల్లా అందుబాటులోకి
తీసుకురానున్న బీఎస్‌ఈ

 ముంబై: మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు కాగిత రహిత(పేపర్‌లెస్) సిప్ విధానాన్ని అందుబాటులోకి తేవాలని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలాఖరు, దీపావళికల్లా ఈ కాగిత రహిత సిప్‌ను అందించే అవకాశాలున్నాయని బీఎస్‌ఈ ప్రతినిధి వెల్లడించారు. ఈ కాగిత రహిత సిప్ కారణంగా ఇన్వెస్టర్లకు  కాలం బాగా ఆదా అవుతుందని,  నెట్ బ్యాంకింగ్‌తో సహా వివిధ చెల్లింపుల విధానాల్లో సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని వివరించారు. ఈ కొత్త విధానంలో ఎలాంటి ధ్రువపత్రాలు దాఖలు చేసే అవసరం లేనందున, సంతకాలు ఇతర విషయాల్లో తప్పులున్నాయనే కారణాలతో తిరస్కరణకు గురయ్యే సమస్య కూడా ఉండదని పేర్కొన్నారు. 

బీఎస్‌ఈ స్టార్ ఎంఫ్ ద్వారా ఈ కాగిత రహిత సిప్‌ను అందిస్తామని వివరించారు.  ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు తమ క్లయింట్ల కోసం ఎక్స్చేంజ్ సిప్(ఎక్స్‌సిప్)ద్వారా మాత్రమే నమోదు చేసే ఆప్షన్ ఉందని,  ఈ విధానంలో ఇన్వెస్టర్లు ఈసీఎస్(ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్) ద్వారా చెల్లింపులు జరిపే వీలు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇక కొత్త కాగిత రహిత సిప్ విధానంలో ఏసీహెచ్(ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్)/ఈసీఎస్ లేదా డెరైక్ట్ డెబిట్ మాండేట్ ఫారమ్ అవసరం లేదని పేర్కొన్నారు.

  దీంతో రిజిస్ట్రేషన్ ఊసే ఉండదని వివరించారు. ఈ విధానం కోసం ప్రముఖ చెల్లింపుల అగ్రిగేటర్‌తో బీఎస్‌ఈ ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ఈ కొత్త విధానం వల్ల తమ చెల్లింపులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఇన్వెస్టర్లకు పూర్తి నియంత్రణ ఉంటుందని వివరించారు. బీఎస్‌ఈ స్టార్ మ్యూచువల్ ఫండ్... భారత్‌లో అతిపెద్ద ఎంఎఫ్ డిస్ట్రిబ్యూటర్ ప్లాట్‌ఫామ్.. నెలకు నాలుగు లక్షల సిప్ లావాదేవీలు జరుగుతాయి.

Advertisement
Advertisement