రాత్రికి రాత్రే.. పెరగవు ధరలు! | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే.. పెరగవు ధరలు!

Published Sat, Aug 29 2015 12:09 AM

రాత్రికి రాత్రే.. పెరగవు ధరలు! - Sakshi

♦ స్మార్ట్ సిటీ.. మెట్రో రైలంటూ ధరలు పెంచుతున్న బిల్డర్లు
 ♦ ఆచితూచి అడుగు ముందుకు వేయాలంటున్న నిపుణులు
 
 హైదరాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపికైందనో.. మెట్రో రైలు ప్రారంభం కానుందనో.. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందనో.. బడా పారిశ్రామిక సంస్థలు వస్తున్నాయనో.. కొందరు బిల్డర్లు నగరంలో స్థిరాస్తి ధరలను ఒక్కసారిగా పెంచేస్తున్నారు. కొంతకాలం నుంచి ఫ్లాట్ల ధ రలు పెరగకపోయినా.. ప్లాట్ల రేట్లు అనూహ్యంగా పెరగడానికి కారణమిదే. కృత్రిమంగా రేట్లు పెంచి దళారుల మాయలో పడి అధిక సొమ్ము పెట్టి స్థిరాస్తులను కొనుగోలు చేయకూడదని, కష్టార్జితాన్నంతా బూడిదపాలు చేసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.     
 - సాక్షి, హైదరాబాద్
 
 స్మార్ట్ సిటీ నగర ముఖచిత్రాన్ని మార్చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాకపోతే ఇది పూర్తికావడానికి ఎంతలేదన్నా పదేళ్ల సమయం పడుతుంది. రవాణా ఆధారిత అభివృద్ధి జరగడానికి మరికొంత కాలం పడుతుంది. భవిష్యత్తులో చోటుచేసుకునే అభివృద్ధిని ఇప్పుడే ఊహించి ఐదేళ్ల తర్వాత పెరగాల్సిన స్థలాల ధరల్ని కొందరు బిల్డర్లు నేడే పెంచేస్తున్నారు. మార్కెట్లో కృత్రిమ గిరాకీ, పోటీతత్వాన్ని సృష్టించి సామాన్యులకు స్థలాలు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. నగరం అభివృద్ధి దిశలో స్థిరంగా పయనించడానికిది సరైన సంకేతం కాదు.

ధరలు క్రమక్రమంగా పెరగాలే తప్ప.. రాత్రికి రాత్రే ధరలు వంద శాతం పెంచడం సరైంది కాదు. బూమ్ సమయంలో విమానాశ్రయాన్ని చూపెట్టి మహేశ్వరంలో గజం ధర రూ.8,000 వరకూ పలికిన లే-అవుట్లున్నాయి. కానీ, నేడో ఇంత ధర పెట్టడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి. మరి అంతకు ముందే కొనుగోలు చేసిన వారి పరిస్థితి.. అటు అమ్ముకోలేక.. ఇటు అట్టే స్థలాన్ని అట్టిపెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండదంటే.. కొనుగోలుదారులు వాస్తవాన్ని అర్థం చేసుకుని అడుగుముందుకేయాలి.

►ఏడాదిన్నర క్రితం మియాపూర్‌లో ప్రతిపాదిత మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గజం స్థలం ధర రూ.13,000కు అటు ఇటుగా ఉండేది. ఈ రేటును బిల్డర్లు రూ.30 వేలు దాటించేశారు. పోనీ ఇక్కడ అనూహ్య రీతిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయా అంటే అదీ లేదు. ప్రధాన రహదారిలో రోడ్లు వెడల్పు చేశారే తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మంచినీటి సరఫరా పెరగలేదు. కాలనీల్లో అంతర్గత రోడ్లూ వేయలేదు. మరి ఎందుకు అంత హఠాత్తుగా రేట్లు పెరిగాయంటే.. మెట్రో స్టేషన్ వస్తుంది సార్ అందుకే రేట్లు పెరిగాయని రియల్టర్లు సమాధానమిస్తున్నారు.

మెట్రో పనులు జరిగినంత మాత్రాన ఇక్కడ నివసించే ప్రజల జీవితాల్లో సమూల మార్పులేమైనా జరిగాయా? ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలేమైనా పుట్టుకొచ్చాయా సమాధానం లేదు. అలాఅని భవిష్యత్తులో జరగదని కొట్టిపారేయ్యలేం. కాకపోతే ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకొని కొనుగోలుదారులెవరైనా ధరల విషయంలో లోతుగా అధ్యయనం చేశాలి. లేకపోతే గతంలో శంషాబాద్ విమానాశ్రయం అనుభవమే పునరావృతం కావొచ్చు.

►ఆదిభట్ల వద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ లు వస్తున్నాయన్న కారణంగా  బిల్డర్లు ప్లాట్ల అమ్మకానికి పోటీపడుతున్నారు. ధరలనూ అమాంతం పెంచేస్తున్నారు. కొనుగోలుదారులు గుర్తించాల్సిన అంశమేమిటంటే.. నివాసయోగ్యమైన ప్రాంంతాల్లోనే స్థలాల ధరలు పెరుగుతాయి. అదికూడా ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలు పుట్టుకొస్తేనే సాధ్యమవుతుంది. మాదాపూర్‌లో ఐటీ పరిశ్రమ ఏర్పాటైన నాలుగైదేళ్ల తర్వాత కానీ ఇక్కడి చుట్టుపక్కల స్థిరాస్తుల రేట్లు పెరగలేదు. 2003 వరకూ మాదాపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో గజం ధర రూ.5 వేల లోపే ఉండేదన్న విషయం మరవకూడదు. కాబట్టి అభివృద్ధి అనేది రాత్రికి రాత్రే జరగదన్న విషయం గుర్తుంచుకోవాలి.

Advertisement
Advertisement