ఏ ట్రేడింగ్‌కైనా ఒకటే ఎక్స్‌ఛేంజ్! | Sakshi
Sakshi News home page

 ఏ ట్రేడింగ్‌కైనా ఒకటే ఎక్స్‌ఛేంజ్!

Published Fri, Dec 29 2017 12:18 AM

Exchanging for any trading - Sakshi

ముంబై: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ, పర్యవేక్షణ సంస్థ సెబీ... షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్, కమోడిటీలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సంబంధించి గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు షేర్లు, కమోడిటీలు, కరెన్సీ ట్రేడింగ్‌కు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లు ఉండగా... వీటిని ఒకే వేదికపైకి తీసుకురావాలని సెబీ నిర్ణయించింది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రావటానికి వీలుగా ఎఫ్‌పీఐ నిబంధనలను సరళతరం చేయటం, మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్రాస్‌ హోల్డింగ్స్‌ (ఒక సంస్థకు రెండు మ్యూచువల్‌ ఫండ్స్‌లో వాటాలుండటం) పరిమితి 10 శాతంగా ఖరారు చేయడం సెబీ నిర్ణయాల్లో కీలకమైనవి. సమావేశం అనంతరం ఈ వివరాలను సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి మీడియాకు వెల్లడించారు.
 
ఇన్వెస్ట్‌మెంట్‌ ఏదైనా... ఎక్స్‌ ఛేంజ్ ఒక్కటే
సెబీ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైనది స్టాక్స్, కమోడిటీలను ఒకే ఎక్స్‌ ఛేంజ్ ప్లాట్‌ఫామ్‌పై ట్రేడింగ్‌కు అనుమతించడం. దీంతో ఎంతో కాలంగా ఆసక్తితో వేచి చూస్తున్న కమోడిటీ, స్టాక్స్‌ అనుసంధానతకు ఎట్టకేలకు ఆమోదం లభించినట్లయింది. రెండు దశల్లో కమోడిటీ డెరివేటివ్స్, ఇతర సెక్యూరిటీ మార్కెట్ల ఏకీకరణ అంశంపై గురువారం నాటి సమావేశంలో సెబీ చర్చించి ఆమోదం తెలిపింది. సెక్యూరిటీల మార్కెట్‌ నియంత్రణ చట్టంలోని ప్రస్తుత నిబంధనలను తొలగించడం ద్వారా అనుసంధాన ప్రక్రియ 2018 

అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు త్యాగి చెప్పారు. దీంతో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని రకాల ఎక్సే్ఛంజ్‌లు స్టాక్స్, కమోడిటీల ట్రేడింగ్‌ ప్రవేశపెట్టేందుకు వీలు పడుతుంది. దేశంలో ప్రస్తుతం స్టాక్స్‌కు సంబంధించి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ప్లాట్‌ఫామ్‌లుగా ఉండగా, కమోడిటీలకు సంబంధించి ఎంసీఎక్స్, ఎన్‌సీడీఈఎక్స్‌ పనిచేస్తున్నాయి. తాజా నిర్ణయంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు కమోడిటీ ట్రేడింగ్‌ను ఆరంభించే అవకాశాలున్నాయి. ఏకీకరణ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు వీలుగా దీన్ని రెండు దశల్లో చేపట్టాలని సెబీ నిర్ణయించింది. మొదటి విడతలో మధ్యవర్తిత్వ స్థాయిలో, రెండో విడతలో ఒకే ఎక్స్‌ఛేంజ్లో ఈక్విటీ, ఈక్విటీ డెరి వేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, వడ్డీ రేట్ల ఫ్యూచర్స్, డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ తదితర వాటిని నడిపించేందుకు వీలు కల్పించనుంది. తొలి దశకు ఇప్పటికే చర్యలను తీసుకోగా, రెండో దశ కోసం చట్టంలో సవరణలు చేయాలని గురువారం నాటి సమావేశంలో నిర్ణయించింది. 

ఎఫ్‌పీఐలకు సుస్వాగతం...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ప్రవేశానికి ఉన్న నిబంధనలను సరళీకరించాలన్నది సెబీ మరో నిర్ణయం. మన దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలున్న ఇతర దేశాల ప్రవేశానికీ ఇది వీలు కల్పించనుంది. విదేశీయులు ఎఫ్‌పీఐలుగా నమోదు చేసుకోకపోయినప్పటికీ, పార్టిసిపేటరీ నోట్ల ద్వారా భారత్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుంది. పీ–నోట్ల మార్గంలో కాకుండా నేరుగా ఎఫ్‌పీఐలుగా రిజిస్టర్‌ చేసుకుని వచ్చేలా చేయటమే తాజా నిర్ణయం వెనకనున్న ఉద్దేశం. ఫలితంగా కెనడా తదితర దేశ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.  

సెక్యూరిటీ రిసీప్ట్‌ల లిస్టింగ్‌
అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీ రిసీప్ట్స్‌ను స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్‌ చేసుకునేందుకు సెబీ అనుమతించింది. సెక్యూరిటీ రంగానికి నిధుల లభ్యత పెంచేందుకు ఇది దోహదం చేయగలదని, ముఖ్యంగా బ్యాంకుల ఎన్‌పీఏల పరిష్కారానికి ఇది ఉపకరిస్తుందని త్యాగి తెలియజేశారు. సెక్యూరిటీ రిసీప్ట్‌ అనేది సెక్యూరిటైజేషన్‌ కంపెనీ లేదా అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ జారీ చేసే పత్రం. మరోవైపు రియల్‌ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ల (ఆర్‌ఈఐటీ) వృద్ధికి బాటలు వేస్తూ హోల్డింగ్‌ కంపెనీల్లో కనీసం 50 శాతం ఇన్వెస్ట్‌ చేసేందుకు వీటిని అనుమతించాలని కూడా సెబీ నిర్ణయం తీసుకుంది. 

ఫండ్స్‌లో 10 శాతమే...
మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్రాస్‌హోల్డింగ్స్‌ను 10%కి పరిమితం చేయాలని సెబీ నిర్ణయించింది. అంటే ఏదైనా ఒక సంస్థకు ఒక మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలో 10 శాతం వాటా ఉంటే, మరో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలో 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా కలిగి ఉండేందుకు ఇకపై వీలు కాదు. దీనివల్ల యూటీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రమోటర్ల వాటాల్లో మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీవోబీ, ఎల్‌ఐసీ సంస్థలకు యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో 18.24 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ సంస్థలకు సొంతంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కూడా ఉండటంతో యూటీఐలో వాటాలు తగ్గించుకోవాల్సి వస్తుంది.

సమాచారం లీక్‌ అయితే చర్యలు...
కంపెనీలకు సంబంధించి కీలకమైన ఆర్థిక వివరాలను వాట్సాప్‌ వంటి వేదికల ద్వారా ముందుగానే సర్క్యులేట్‌ చేసిన ఘటనల నేపథ్యంలో సెబీ తాజాగా గట్టి హెచ్చరికలు చేసింది. ఈ విషయంలో బాధ్యులైన వారు, ఆడిటర్లతో పాటు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అవసరమైతే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను కఠినతరం చేస్తామన్నారు. ఇటీవల వాట్సాప్‌లో సమాచారాన్ని లీక్‌ చేసిన ఘటనలో కంపెనీల పాత్ర ఉందని త్యాగి స్పష్టం చేశారు.  

Advertisement
Advertisement