Sakshi News home page

ఎగుమతుల క్షీణత ఆగింది

Published Tue, Oct 11 2016 12:10 AM

ఎగుమతుల క్షీణత ఆగింది

వృద్ధి నిదానంగానే: నిర్మలా సీతారామన్
వాణిజ్య సమాచారంతో డాష్‌బోర్డ్ ప్రారంభం

న్యూఢిల్లీ: ఎగుమతుల క్షీణత ఆగిపోయిందని, వృద్ధి మాత్రం నిదానంగా ఉండవచ్చని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం ఢిల్లీలో  కేంద్ర మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాబోయే నెలల్లో ఎగుమతుల తీరు ఎలా ఉంటుందున్న విలేకరుల ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... ‘ప్రస్తుతం ఎగుమతుల క్షీణత ఆగిపోయిందన్నది స్పష్టం. నిలకడైన వృద్ధి కోసమే చూస్తున్నాం. ఎగుమతుల్లో వృద్ధి నిదానంగా ఉన్నప్పటికీ నిలకడగానే ఉంటుంది’ అని చెప్పారు.

 ఎగుమతులు, దిగుమతుల సమస్త సమాచారం
విదేశీ వాణిజ్య సమాచారానికి సంబంధించిన డాష్‌బోర్డ్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ విండో ద్వారా అంతర్జాతీయంగా భారత్ స్థానం ఏంటి, భారత్ నుంచి ఏ దేశం సరుకులను దిగుమతి చేసుకుంటోంది, దేశం నుంచి అన్ని రకాల ఎగుమతులు, దిగుమతులు, పోర్టులు, ప్రాంతాల వారీగా ఇలా సమస్త సమాచారం ఇక్కడ లభ్యమవుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత రెండు సంవత్సరాల డేటాను అందుబాటులో ఉంచినట్టు ఆమె చెప్పారు. దేశీయ ఎగుమతులు, దిగుమతులు, ఈ రెండింటి మధ్య వాణిజ్యంలో తేడా తదితర వివరాలను విశ్లేషణ విధానంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంలో భాగంగానే ఈ డాష్‌బోర్డ్‌ను ప్రారంభించినట్టు మంత్రి వివరించారు.

ఈ సంపూర్ణ సమాచారం ఆధారంగా దేశం నుంచి ప్రత్యేకంగా ఓ దేశానికి జరిగే ఎగుమతులు, దిగుమతుల సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చన్నారు. ఈ డాష్‌బోర్డ్ ఎగుమతిదారులు, దిగుమతిదారులు, ఎగుమతి దారుల సమాఖ్య, పరిశోధకులు, విశ్లేషకులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టుల నుంచి జరిగే లావాదేవీల సమాచారాన్ని అవి మాన్యువల్‌గా పంపుతున్నాయని, దీంతో నెల తర్వాత సంబంధిత వాణిజ్య వివరాలను విడుదల చేస్తున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. చాలా పోర్టులు డిజిటైజేషన్ కావాల్సి ఉందన్నారు. ఇందుకు సమయం పడుతుందని, త్వరలోనే రియల్‌టైమ్ డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement