రెండుగా పీఎస్‌యూ బ్యాంకుల సీఎండీ పోస్టు! | Sakshi
Sakshi News home page

రెండుగా పీఎస్‌యూ బ్యాంకుల సీఎండీ పోస్టు!

Published Tue, Aug 26 2014 12:37 AM

రెండుగా పీఎస్‌యూ బ్యాంకుల సీఎండీ పోస్టు!

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల్లో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) పోస్టును విభజించేందుకు ఆర్థిక శాఖ సమాయత్తమవుతోంది. ఇటీవలి కాలంలో పీఎస్‌యూ బ్యాంకుల్లో అవినీతి కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.

ఇందులో భాగంగా సీఎండీ పోస్టును విడగొట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి జీఎస్ సంధూ సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వీలుగా యాజమాన్యాల్లో వృత్తి నైపుణ్యాలను పెంచడానికి చర్యలు చేపడుతున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత వారంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ దిశగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భూషణ్ స్టీల్, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌ల రుణ పరిమితి పెంచేందుకుగాను రూ.50 లక్షల లంచం తీసుకున్న ఆరోపణలపై సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్‌కే జైన్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక తాజాగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), దేనా బ్యాంకుల్లో రూ.436 కోట్ల విలువైన కస్టమర్ల ఫిక్సిడ్ డిపాజిట్ నిధులు దుర్వినియోగమైనట్లు వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌పై ఆర్థిక శాఖ ఫోరెన్సిక్ ఆడిట్‌కు కూడా ఆదేశించింది.

 ఇదివరకే ఆర్‌బీఐ సిఫార్సు..: కాగా, సీఎండీ పోస్టును విడగొట్టాల్సిందిగా గతంలోనే ఆర్థిక శాఖకు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సూచించడం గమనార్హం. చాలాసందర్భాల్లో డెరైక్టర్ల బోర్డులో సీఎండీలు పెత్తనం చలాయిస్తున్నారని.. బోర్డుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే ఈ పోస్టును విభజించాల్సిందేనని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా సీఎండీ ఉంటున్నారు. ఇక దేశీ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో మాత్రం అత్యున్నత స్థానంలో చైర్మన్ ఉండగా.. మరో నలుగురు ఎండీలు వివిధ ఎగ్జిక్యూటివ్ పాత్రలను పోషిస్తున్నారు. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మాత్రం చైర్మన్, ఎండీ పోస్టులు వేర్వేరుగా ఉన్నాయి.

Advertisement
Advertisement