ఒక్కరోజు అమ్మకాలు.. రూ. 1400 కోట్లు! | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు అమ్మకాలు.. రూ. 1400 కోట్లు!

Published Wed, Oct 5 2016 8:12 AM

ఒక్కరోజు అమ్మకాలు.. రూ. 1400 కోట్లు! - Sakshi

ఆన్‌లైన్ అమ్మకాలలో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు పెడుతున్నారంటే చాలు.. మనవాళ్లు విచ్చలవిడిగా కొనేస్తారన్న విషయం మరోసారి రుజువైంది. ఐదు రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లతో మోతెక్కిస్తున్న ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్.. ఇలాంటి సంస్థలన్నీ కూడా బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తున్నాయి. అందులోనూ ఫ్లిప్‌కార్ట్ మొదటిరోజు అమ్మకాలు రికార్డు బద్దలుకొట్టాయి. ప్రారంభం రోజునే ఏకంగా రూ. 1400 కోట్ల అమ్మకాలను నమోదు చేసి ఫ్లిప్‌కార్ట్ ఈ రేసులో దూసుకుపోయింది. పోటీదారుల కంటే నాలుగు అడుగులు ముందే నిలిచింది. గత సంవత్సరం సాధించిన అమ్మకాల కంటే రెట్టింపునకు పైగా ఈసారి అమ్మకాలు సాగాయని తెలుస్తోంది.

వాస్తవానికి ఈసారి వెయ్యి కోట్ల రూపాయల వరకు అమ్మకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ బిన్నీ బన్సల్ చెప్పారు. తొమ్మిదేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో కేవలం పుస్తకాల అమ్మకాలతో వ్యాపారం ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ తొలిసారి ఒక్క రోజులో వెయ్యి కో్ట్ల మార్కును దాటి రికార్డు సాధించింది. ఒక్క రోజులోనే గ్రాస్ అమ్మకాలు ఇంత స్థాయిలో ఉండటం ఇప్పటి వరకు మరే భారతీయ ఈ-టైలర్‌కు సాధ్యం కాలేదని అంటున్నారు. దసరా, దీపావళి సీజన్ సందర్భంగా మొత్తం అందరూ కలిసి ఐదురోజుల అమ్మకాల్లో దాదాపు రూ. 12 వేల కోట్లు సాధిస్తారని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో మొత్తం అమ్మకాలు కేవలం రూ. 7 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే భారతీయ రీటైల్ మార్కెట్ బాగా పుంజుకుందని అర్థమవుతోంది.

Advertisement
Advertisement