Sakshi News home page

ఫుడ్ స్టార్టప్‌లకు నిధులందక చిక్కులు

Published Tue, May 3 2016 4:18 PM

ఫుడ్ స్టార్టప్‌లకు నిధులందక చిక్కులు - Sakshi

హా.. హా.. అనిపించే రుచికరమైన ఆహార పదార్థాలను ఆఫర్ చేస్తున్న ఫుడ్ స్టార్టప్‌లు మూతపడుతున్నాయి. డాజో, స్పూన్ జాయ్, ఈట్లో, ఓలా కేఫ్‌లు వాటి కార్యకలాపాలను పూర్తిగా మూసేశాయి. గుర్గావ్‌కు చెందిన మరో ఫుడ్ డెలివరీ స్టార్టప్ యుమిస్ట్ బెంగళూరులో తన ఆపరేషన్లను మూసేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. బెంగళూరులో ప్రారంభించిన 10 నెలల్లోనే ఈ కంపెనీ ఫుడ్ డెలివరీ బిజినెస్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరి రెండు త్రైమాసికాల నుంచి చాలా ఫుడ్ టెక్ కంపెనీలకు నిధుల రాక సరిగా లేకపోవడంతో పుడ్ స్టార్టప్‌ల నుంచి వైదొలగుతున్నట్టు తెలుస్తోంది.

2015 ప్రథమార్థంలో ఫుడ్ స్టార్టప్‌లకు పెట్టుబడుల వెల్లువ బాగానే ఉన్నా.. తర్వాత మందగించడంతో రికార్డులు సృష్టించిన ఫుడ్ స్టార్టప్‌లకు గడ్డు పరిస్థితి నెలకొంది. ప్రతి ఆర్డర్ మీద 20 శాతం మార్జిన్లతో చాలా స్టార్టప్‌లు ఈ ఫుడ్ విభాగంలోకి ప్రవేశించినా.. నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫుడ్ స్టార్టప్‌లలోకొన్ని కంపెనీలు డెలివరీకి చార్జీలు వసూలు చేస్తుండగా, మరికొన్ని కంపెనీలు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.

అయితే బెంగళూరులో కంపెనీ కార్యకలాపాలు మూసేసి.. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో కార్యకలాపాలను విస్తరిస్తున్నామని యుమిస్ట్ పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులో తమ కార్యకలాపాలకు విశ్రాంతి పలుకుతున్నామని యుమిస్ట్ తమ బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. 2015 ఆగస్ట్‌లో బెంగళూరులో ప్రారంభించిన దగ్గర్నుంచి యుమిస్ట్ రెంటల్ కిచెన్ ను ఆపరేట్ చేసింది. తమ స్థాయికి తగ్గట్టుగా మెనూలో మార్పులకు అవకాశం లేకపోవడంతో బెంగళూరులో కార్యకలాపాలు మూసేస్తున్నట్టు కంపెనీ పోస్ట్ చేసింది. అయితే 12 వేల మెగా కిచెన్‌తో ఎన్‌సీఆర్ పరిధిలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించబోతుందని పేర్కొంది. ఈ ప్రాంతంలో కేటరింగ్ ఎక్కువగా వృద్ధి ఉంటుందని తెలిపింది.

జుమాటో మాజీ సీఈవో అలోక్ జైన్, ఎఫ్ అండ్ బి ఎంటర్ ప్రెన్యూర్ అభిమన్యు మహేశ్వరి కలిసి 2014 నవంబర్‌లో యుమిస్ట్‌ను స్థాపించారు. హోమ్లీ డెలివరీ భోజనాలను అందించడమే లక్ష్యంగా యుమిస్ట్ పనిచేసింది. వేడివేడి తినుబండారాలను 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే అందించిన యుమిస్ట్..ఆన్ లైన్ యాప్ మార్కెట్లో తన బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది.

Advertisement

What’s your opinion

Advertisement