వాణిజ్య యుద్ధంలో ఎల్లో మెటల్‌ మెరుపు | Sakshi
Sakshi News home page

వాణిజ్య యుద్ధంలో ఎల్లో మెటల్‌ మెరుపు

Published Mon, Mar 26 2018 1:57 AM

Gold increase 33 dollars in a week - Sakshi

అమెరికా ప్రారంభించిన వాణిజ్యయుద్ధం పసిడికి బలంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే  బుధవారం అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌.. వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 1.5 శాతం– 1.75 శాతానికి చేరింది. ఈ ఏడాది ఇది తొలి విడత పెంపు కాగా.. మరో రెండు దఫాలు పెంచే అవకాశాలున్నట్లు సంకేతాలిచ్చింది. నిజానికి ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంకేతం కాబట్టి బుల్‌ ధోరణిలో ఉన్న పసిడి కొంత వెనక్కు తగ్గాలి.

అయితే ఇదేమీ పట్టించుకోకుండా పసిడి శుక్రవారంతో ముగిసిన వారంలో ఏకంగా 33 డాలర్లు ఎగసింది. 1,347 డాలర్ల వద్ద ముగిసింది.  ఒకేవారం పసిడి ఈ స్థాయిలో పెరగడం రెండేళ్లలో ఇదే తొలిసారి. 1,360 డాలర్లను తాకిన పసిడి 17తో ముగిసిన శుక్రవారం ముందు నాలుగు వారాలుగా తగ్గుతూ వచ్చి, 1,314 డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. ఫెడ్‌ నిర్ణయం నేపథ్యంలో పైకి ఉరుకుతుందనుకున్న డాలర్‌ ఇండెక్స్‌ వారం వారీగా  90.17 నుంచి 89.10కి చేరింది.

ఏడాది మధ్యలో 1,400 డాలర్లపైకి
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి అమెరికా–చైనాల మధ్య తీవ్రమైన వాణిజ్యయుద్ధం, దీనికితోడు అంతర్జాతీయంగా బౌగోళిక ఉద్రిక్తతలూ పసిడి సమీప భవిష్యత్తులో బలంగా ఉండేందుకు దోహదపడే అంశమని నిపుణుల విశ్లేషణ. ఈ ఏడాది మధ్యలో పసిడి 1,400 డాలర్లపైకి పెరుగుతుందన్నది తమ అంచనా అని డైలీఫారెక్స్‌.కామ్‌లో కరెన్సీ వ్యూహకర్త చిరిస్టోఫర్‌ వికిహో పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధం, బలహీన డాలర్‌ మాత్రమే కాకుండా, పెరుగుతున్న అమెరికా ప్రభుత్వ రుణ భారాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. 

కాగా ప్రస్తుతం ఉన్న వాణిజ్యయుద్ధం ఉద్రిక్తత తగ్గితే మాత్రం పసిడి ప్రస్తుత స్థాయి నుంచి 40 డాలర్లు పడే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆందోళనలు కొనసాగితే, పెరుగుదల అపరిమితంగా ఉంటుందన్నది తమ అభిప్రాయమని వారు తెలిపారు.  ఆయా ప్రభావ అంశాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పసిడి 1,250 డాలర్లు – 1,400 డాలర్ల స్థాయిలోనే తిరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం.  1,300, 1,270, 1,240 డాలర్ల వద్ద పసిడికి పటిష్ట మద్దతు ఉందని వారు పేర్కొంటున్నారు. ఇక ఎగువస్థాయిలో తక్షణ నిరోధం 1,365 డాలర్లు.  

దేశంలోనూ లాభాలు
అంతర్జాతీయంగా పసిడి బలోపేతం,  దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి వారం వారీగా దాదాపు అక్కడక్కడే ఉండడం (65.02)  వంటి అంశాలు దేశీయంగా పసిడి పెరుగుదలకు దోహదపడ్డాయి.  వారంలో ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజీలో 10 గ్రాముల ధర రూ. 683 పెరిగి రూ.30,907కి చేరింది. 

ఇక దేశీయంగా ముంబై ప్రధాన మార్కెట్‌లో పసిడి వారం వారీగా  99.9 స్వచ్ఛత ధర  రూ. 375 పెరిగి రూ.30,835కి చేరింది.  99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో ఎగసి రూ. 30,685కు చేరింది.  వెండి కేజీ ధర రూ. 190 లాభంతో రూ.38,465కి పెరిగింది.  

Advertisement
Advertisement