జీఎస్‌టీ ఎఫెక్ట్‌: ఎఫ్‌ఎంసీజీ షేర్ల జోరు | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ ఎఫెక్ట్‌: ఎఫ్‌ఎంసీజీ షేర్ల జోరు

Published Tue, May 23 2017 1:14 AM

జీఎస్‌టీ ఎఫెక్ట్‌: ఎఫ్‌ఎంసీజీ షేర్ల జోరు - Sakshi

ముంబై: జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయించిన పన్ను రేట్లకు అనుగుణంగా సోమవారంనాటి మార్కెట్‌ హెచ్చుతగ్గులకు లోనయ్యింది. కొన్ని ముఖ్యమైన ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు తగ్గనున్న నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ షేర్లు ర్యాలీ జరపగా, పన్ను రేట్లు అధికంగా కానున్నందున సిమెంటు షేర్లు క్షీణించాయి. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా ట్రేడింగ్‌ ప్రారంభంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా పెరిగి 30,712 పాయింట్ల గరిష్టస్థాయికి చేరి, అటుతర్వాత 30,517 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది.

 చివరకు క్రితం ట్రేడింగ్‌ రోజుతో పోలిస్తే 106 పాయింట్ల లాభంతో 30,571 పాయింట్ల వద్ద ముగిసింది. 9,499–9,428 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 10 పాయింట్ల లాభంతో 9,438 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌లోఎఫ్‌ఎంసీజీ షేర్లకు వున్న అధిక వెయిటేజీ వల్ల ఈ సూచి పెరుగుదల 0.35%కాగా, నిఫ్టీ లాభం 0.11 శాతానికే పరిమితంకావడం గమనార్హం.

ఐటీసీ 6 శాతం జూమ్‌...: ముఖ్యంగా ప్రధాన ఎఫ్‌ఎంసీజీ షేరు ఐటీసీ 6 శాతం మేర ర్యాలీ జరిపి చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ. 303 వద్ద ముగిసింది. హిందుస్తాన్‌ యూనీలీవర్‌ 1 శాతంపైగా ఎగిసి కొత్త గరిష్టస్థాయి రూ. 1,020 వద్ద క్లోజయ్యింది. ఇతర ఎఫ్‌ఎంసీజీ షేర్లు నెస్లే, బ్రిటానియా, మారికో, డాబర్‌ ఇండియాలు కూడా పెరిగాయి. బీఎస్‌ఈ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 3 శాతంపైగా ఎగిసింది. సెన్సెక్స్‌–30 షేర్లలో ఎల్‌ అండ్‌ టీ, అదాని పోర్ట్స్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్‌లు 1–2 శాతం మధ్య పెరిగాయి.

Advertisement
Advertisement