తనఖా బాటలో ప్రమోటర్ల వాటాలు.. | Sakshi
Sakshi News home page

తనఖా బాటలో ప్రమోటర్ల వాటాలు..

Published Wed, Jan 20 2016 1:58 AM

తనఖా బాటలో ప్రమోటర్ల వాటాలు..

* 46 శాతం పైగా షేర్లు తనఖాలోనే 
* వీటి విలువ రూ. 2 లక్షల కోట్ల పైమాటే..

ముంబై: ఓవైపు స్టాక్స్ ధరలు అంతకంతకూ పతనమవుతుండగా.. మరోవైపు కంపెనీల ప్రమోటర్ల  షేర్ల తనఖా మరింతగా పెరుగుతోంది.  దాదాపు 517 కంపెనీల ప్రమోటర్ల వాటాల్లో సుమారు 46.35 శాతం షేర్లు తనఖాలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటి తర్వాత ఇది అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం గతేడాది ఆఖరు త్రైమాసికంలో ప్రమోటర్ల వాటాల తనఖా 14 శాతం పెరిగింది. ఇలా కుదవ పెట్టిన షేర్ల విలువ సెప్టెంబర్ త్రైమాసికం ఆఖరులో రూ. 1.78 లక్షల కోట్లుగా ఉండగా..

డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ. 2.03 లక్షల కోట్లకు చేరింది. కుదవ పెట్టేందుకు మరిన్ని షేర్లు లేక.. అలాగని తీసుకున్న రుణాన్ని చెల్లించేసేంతగా నిధులూ లేక ప్రమోటర్లు చేతులెత్తేస్తే తలెత్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని పరి శీలకులు చెబుతున్నారు. షేరు భారీగా పతనం కావడంతో పాటు కంపెనీ యాజమాన్యమే మారిపోయే అవకాశాలు ఉండటంతో తాజా పరిస్థితి ఆయా సంస్థల ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది.
 
వంద శాతమూ ఉన్నాయి..
సుమారు పాతిక కంపెనీల ప్రమోటర్లు నూటికి నూరు శాతం వాటాలను తనఖా పెట్టేశారు. బజాజ్ హిందుస్తాన్ షుగర్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్, ఎస్‌ఈఎల్ మాన్యుఫాక్చరింగ్, సుబెక్స్, స్పెంటెక్స్ ఇండస్ట్రీస్, పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ఇక దాదాపు 80 కంపెనీల్లో ప్రమోటర్లు తమ వాటాల్లో 90 శాతాన్ని, సుమారు 200 పైగా సంస్థల ప్రమోటర్లు 50 శాతం వాటాలను తనఖాలో ఉంచారు. తనఖాలో ఉంచిన షేర్ల విలువపరంగా చూస్తే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, కెయిర్న్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్సార్ ఆయిల్ సంస్థలు టాప్‌లో ఉన్నాయి.

ఇవి తనఖా ఉంచిన షేర్ల విలువ రూ. 40,000 కోట్ల పైమాటే. డిసెంబర్ త్రైమాసికంలో 82 సంస్థల ప్రమోటర్ల షేర్ల తనఖా గణనీయంగా పెరిగింది. అయితే, తనఖాలో ఉన్న షేర్లను విడిపించుకుంటున్న ప్రమోటర్లూ ఉన్నారు. మంగళం సిమెంటు, ఆశాపురా మైన్‌కెమ్, సెంచరీ ఎంకా మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
 
తనఖా ఎందుకు..
కార్యకలాపాల విస్తరణకు, కంపెనీ ఎదుగుదలకు, ఇతర ప్రాజెక్టులకు నిధులు సమీకరించుకునేందుకు, కంపెనీ నిర్వహణా నిధుల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ప్రమోటర్లు షేర్లను తనఖా పెట్టడం సర్వసాధారణమే. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) షేర్ల విలువలో దాదాపు 50 శాతం దాకా రుణాలు ఇస్తుంటాయి. దీంతో ఎక్కువగా ప్రమోటర్లు వాటివైపు మొగ్గుచూపుతుంటారు. అలాగే మిగతా మార్గాలతో పోలిస్తే తనఖా ద్వారా రుణాలు కాస్త చౌకగా లభించే అవకాశాలుండటం కూడా ప్రమోటర్లు ఇటువైపు మళ్లడానికి కారణం.  
 
పరిణామాలేంటి..
ప్రమోటర్ల వాటాలు భారీ స్థాయిలో తనఖాలో ఉండటం ఇన్వెస్టర్లకు అంత శ్రేయస్కరం కాదని మార్కెట్ పరిశీలకుల విశ్లేషణ. ప్రమోటర్లు తమ వాటాల్లో 50 శాతం పైగా షేర్లను తనఖా పెట్టినప్పుడో.. లేదా కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 20 శాతం పైగా షేర్లు తనఖాలో ఉన్నప్పుడో సమస్య తలెత్తుతుంది. షేరు ధర నిర్దిష్ట స్థాయికి మించి పతనమైతే ప్రమోటర్లు.. మార్జిన్‌ను కొనసాగించేందుకు మరిన్ని షేర్లు తనఖా పెట్టాల్సి వస్తుంది.

ఒకవేళ అందుకు తగినన్ని షేర్లు ప్రమోటర్లు పెట్టలేకపోయినా, తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేంతగా నిధులు వారి వద్ద లేకపోయినా.. రుణమిచ్చిన సంస్థలు తక్షణం చర్యలకు ఉపక్రమిస్తాయి. తనఖా పెట్టిన షేర్లను అమ్మేసుకుని డబ్బు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో స్టాక్ ధర మరింతగా పతనమవుతుంది. ఫలితంగా ఇన్వెస్టర్లకు మరిన్ని నష్టాలూ రావొచ్చు. ప్రమోటర్లు తీసుకున్న రుణాలను చెల్లించలేకపోయినప్పుడు రుణదాతలు ఇలా తమ దగ్గరున్న షేర్లను అమ్మేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.

Advertisement
Advertisement