Sakshi News home page

గృహ రుణం మరింతగా..

Published Sun, Nov 2 2014 1:07 AM

గృహ రుణం మరింతగా..

రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గొచ్చన్న సంకేతాలు కనిపిస్తుండటంతో  రియల్టీ మార్కెట్లో మళ్లీ కాస్త హడావుడి కనిపిస్తోంది. కొనుగోలుదారులకు అందుబాటు రేటులో ఇళ్లను అందించేందుకు డెవలపర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు మరింత ఎక్కువ రుణం పొందేందుకు వెసులుబాటు కల్పిస్తూ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కూడా తన వంతు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వర్గాల సొంతిల్లు కల మరింత సులువుగా సాకారమయ్యేలా తోడ్పడే తాజా పరిణామాల గురించి వివరించేదే ఈ ప్రాఫిట్ కథనం.
 
మధ్యతరగతి వర్గాల వారి సొంతింటి కల సాకారానికి ఎదురయ్యే అనేకానేక అడ్డంకుల్లో ఇంటి ధర ఒకటి. సరే.. ఏదో రకంగా ఈఎంఐలు వగైరా లెక్కలు వేసుకుని మనకు అందుబాటు రేటులో ఉండే ఇల్లు చూసుకున్నా.. డౌన్‌పేమెంటు సమకూర్చుకోవడమనేది మరో పెద్ద సమస్య. అసలే ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు భారీ స్థాయిలో డౌన్‌పేమెంట్లు కట్టలేక... సొంతింటి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది కొందరికి.

ఇలాంటి వారికే ఊరటనిస్తూ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తాజాగా లోన్ టు వేల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తి నిబంధనలను సడలించింది. గృహ రుణాలకు సంబంధించి ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా లోన్ పొందేలా వీలు కల్పించింది.దీని ప్రకారం హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇకపై రూ. 20 లక్షలకు పైగా ఖరీదు చేసే ప్రాపర్టీలకు కూడా 90 శాతం దాకా రుణం ఇవ్వొచ్చు. అయితే, ఈ రుణానికి మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ నుంచి బీమా ఉండాలి.
 
గతంలో ఎల్‌టీవీ..
ఇప్పటిదాకా రూ. 20 లక్షల దాకా గృహ రుణాలకు సంబంధించి ఎల్‌టీవీ నిష్పత్తి ప్రకారం ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు రుణం ఇచ్చేవి. అదే రూ. 20 లక్షలు నుంచి రూ. 75 లక్షల దాకా రుణాలపై ఎల్‌టీవీ నిష్పత్తి 80 శాతంగాను, అంతకు మించితే 75 శాతంగాను ఉండేది. ఉదాహరణకు చెప్పాలంటే.. గతంలో రూ. 50 లక్షల ఇల్లు కొనాలనుకుంటే రూ. 10 లక్షల పైచిలుకు డౌన్‌పేమెంట్ సమకూర్చుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే రూ. 20 లక్షలు మించిన గృహాలపై 80 శాతం దాకా మాత్రమే రుణం లభించేది. ఇక దీనికి తోడు జీతం సంబంధిత పరిమితులు వగైరాలు కూడా కలుపుకుంటే వచ్చే రుణ మొత్తం మరింత తగ్గిపోయి డౌన్‌పేమెంట్ మరింత అధికంగా కట్టాల్సి వచ్చేది.
 
ఇప్పుడు..
ప్రస్తుతం మార్టిగేజ్ గ్యారంటీ ప్రోగ్రాం కింద రూ. 20 లక్షలకు పైబడిన రుణాలకు కూడా 90% దాకా ఎల్‌టీవీ తీసుకునే అవకాశం లభిస్తుంది. దీని వల్ల అదే రూ. 50 లక్షల ఇంటికి సుమారు పది శాతం డౌన్‌పేమెంట్ సమకూర్చుకుంటే సరిపోతుంది. అంటే..     దాదాపు రూ. 5 లక్షలు సర్దుబాటు చేసుకుంటే చాలు. మొత్తం మీద.. ఎన్‌హెచ్‌బీ చేసిన సవరణల వల్ల గతానికి, ప్రస్తుతానికి ఒక చిన్న మార్పు వచ్చింది. గతంలో రుణ గ్రహీత, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ మధ్య మాత్రమే లావాదేవీ జరిగేది. ప్రస్తుతం మరింత అధిక లోన్ పొందాలంటే మూడో పక్షమైన మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీ కూడా తోడవుతుంది.

ఇక, ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం మరొకటుంది. హెచ్‌ఎఫ్‌సీ అధిక రుణం  ఇస్తుంది కదా అని కాస్త ఎక్కువ డౌన్‌పేమెంట్ కట్టగలిగే స్తోమత ఉన్నా కట్టకుండా రుణమే తీసుకుంటే ఆ తర్వాత అధిక వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వస్తుందన్నది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకూ డౌన్‌పేమెంట్ మొత్తం ఎక్కువ ఉండేలా చూసుకుంటే.. అధిక రుణం, వడ్డీల భారం తగ్గించుకోవచ్చు. ఏదైతేనేం.. ప్రస్తుతం పండుగ సీజన్ అనీ, మరొకటని బ్యాంకులు గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజులు తగ్గిం చడం, ప్రీ పేమెంట్ చార్జీలు రద్దు చేయడం, ఉచితంగా వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయం అంటూ వివిధ ఆఫర్లతో ఊరిస్తున్నాయి. వీటికి సంబంధించి ఏయే బ్యాంకులు ఏమేం ఆఫర్లు ఇస్తున్నాయన్నది బేరీజు వేసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి.
 
మార్టిగేజ్ గ్యారంటీ..

దీన్నే మార్టిగేజ్ బీమా అని కూడా అంటారు. ఈ బీమా పాలసీ తీసుకుంటే .. ఒకవేళ గృహ కొనుగోలుదారు గానీ రుణం తిరిగి చెల్లించలేక చేతులెత్తేసిన పక్షంలో హౌసింగ్ ఫైనాన్స్ సంస్థకు (హెచ్‌ఎఫ్‌సీ) సదరు బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. ఆ రకంగా హెచ్‌ఎఫ్‌సీ ఇచ్చిన రుణాలకు కాస్త భరోసా ఉంటుంది. అందుకే, మరికాస్త అధిక మొత్తం రుణం ఇవ్వడానికి హెచ్‌ఎఫ్‌సీలు ముందుకు రాగలవు. దేశీయంగా తొలి మార్టిగేజ్ గ్యారంటీ సంస్థ అయిన ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కార్పొరేషన్‌ను స్వయంగా ఎన్‌హెచ్‌బీనే 2012లో ఏర్పాటు చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లే ఈ మార్టిగేజ్ బీమాను తీసుకునే వారు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సందర్భాన్ని బట్టి హెచ్‌ఎఫ్‌సీ సైతం ఈ ప్రీమియం భారం తనపై వేసుకున్నా.. దాన్ని అంతిమంగా రుణగ్రహీతకే బదలాయించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement