Sakshi News home page

టోకు ధరలు మరింత తగ్గాయ్

Published Fri, May 15 2015 1:46 AM

టోకు ధరలు మరింత తగ్గాయ్

ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం -2.65 శాతం క్షీణత
- వరుసగా 4 నెలలుగా ఇదే ధోరణి
- ఆహారోత్పత్తుల ధరలు మాత్రం పెరిగాయ్...
 న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్‌లో అసలు పెరక్కపోగా 2.65 శాతం (మైనస్) క్షీణించింది. అంటే 2014 ఏప్రిల్‌తో పోల్చితే మొత్తం టోకు వస్తువుల బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా, అప్పటి నెలతో పోల్చితే 2015 ఏప్రిల్‌లో -2.65 శాతం తగ్గాయన్నమాట. 2014 నవంబర్ నుంచీ ‘జీరో’ స్థాయిలో కదులుతున్న ద్రవ్యోల్బణం రేటు జనవరి నుంచి ఏకంగా మైనస్‌లోకి జారిపోయింది. ఇది వ్యవస్థలో డిమాండ్ లేకపోవడానికి ప్రతిబింబమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
 
మూడు విభాగాలూ చూస్తే...
 2014 ఏప్రిల్ ధరలతో పోల్చి 2015 ఏప్రిల్‌లో ధర ల స్పీడ్‌కు సంబంధించి టోకు ధరల సూచీలోని ప్రధాన మూడు విభాగాల తీరునూ  పరిశీలిస్తే..
     ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌కు సంబంధించి ప్రాథమిక వస్తువుల (దాదాపు 20% వెయిటేజ్) తీరు- ఈ బాస్కెట్ వార్షిక ధరల పెరుగుదల రేటు కేవలం 0.25%గా నమోదయ్యింది. ఫుడ్ ఆర్టికల్స్ (14% వెయిటేజ్) ధరలు మాత్రం 5.73% ఎగశాయి. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు (వెయిటేజ్ 4%) అసలు పెరక్కపోగా -6.18% క్షీణతను నమోదు చేసుకున్నాయి.
     ఇక దాదాపు 15% వాటావున్న ఇంధనం- విద్యుత్ విభాగంలో ధరలు సైతం వార్షికంగా అసలు పెరక్కపోగా -13.03% క్షీణించాయి.
     సూచీలో 65 % వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు (కోర్ విభాగం) సైతం అసలు పెరక్కపోగా క్షీణతలో -0.52 శాతంగా ఉన్నాయి.
 
ముఖ్య ఆహార ఉత్పత్తుల ధరలు..
వార్షికంగా చూస్తే... 2015 ఏప్రిల్‌లో బంగాళ దుంప ధరలు 41.14% తగ్గాయి. కూరగాయల టోకు బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా స్వల్పంగా 1.32% తగ్గాయి. బియ్యం ధరలు స్వల్పంగా 0.04% ఎగశాయి. ఉల్లి ధర 29.97% పెరిగింది. పప్పు దినుసులు (15.38%), పండ్లు (14.22%), పాలు (7.42%) వంటి ఆహార ఉత్పత్తుల సైతం ధరలు పెరిగిన వస్తువుల జాబితాలో ఉన్నాయి. వ్యవస్థలో డిమాండ్ వృద్ధికి బ్యాంకింగ్ రుణ రేటు కోత మరింత తప్పదని పరిశ్రమ చాంబర్లు డిమాం డ్ చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రానున్న సమీక్షలో(జూన్ 2న) మరోదఫా రెపో రేటును తగ్గించాలని కోరాయి.

Advertisement

What’s your opinion

Advertisement