కేంద్రంతో కలసి నడిపే అవకాశమే లేదు | Sakshi
Sakshi News home page

కేంద్రంతో కలసి నడిపే అవకాశమే లేదు

Published Fri, Jul 7 2017 12:34 AM

కేంద్రంతో కలసి నడిపే అవకాశమే లేదు

ఎయిర్‌ ఇండియాపై ఇండిగో స్పష్టీకరణ
విదేశీ పరమైతే అదో షేక్స్‌పియర్‌ విషాదమేనని వ్యాఖ్య
ఎయిరిండియా విదేశీ సేవలపైనే ఆసక్తి
అంతర్జాతీయ రూట్లలో కార్యకలాపాలకు ఉపయోగం


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో కలసి ఉమ్మడిగా ఎయిరిండియా నిర్వహణ అన్నది ‘‘చాలా చాలా కష్టమైన ప్రతిపాదన’గా చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేశ్‌ గంగ్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. జాతీయ విమానయాన సంస్థ అంతర్జాతీయ ఆస్తులు విదేశీ సంస్థ పాలైతే అది షేక్స్‌పియర్‌ విషాదమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఎయిరిండియాలో వాటా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, అందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు ఇండిగో కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. రూ.52,000 కోట్ల రుణభారంతో సతమతమవుతున్న సంస్థను కొనుగోలు చేయాలని కంపెనీ తీసుకున్న నిర్ణయంపై వాటాదారుల నుంచి ఆందోళన వ్యక్తమైంది.

దీంతో కంపెనీ సహ వ్యవస్థాపకుడు గంగ్వాల్, మరో సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ భాటియాతో కలసి సమావేశం ఏర్పాటు చేసి తమ ప్రతిపాదలపై ఇన్వెస్టర్లు, విశ్లేషకులకు వివరించే ప్రయత్నం చేశారు. ‘‘ప్రభుత్వంతో జాయింట్‌ వెంచర్‌ లేదా ఉమ్మడి భాగస్వామ్యం అన్నది చాలా కష్టమైన ప్రతిపాదన. ఆ దిశగా మేము వెళ్లడం లేదు. ఎయిరిండియాలో ప్రభుత్వం మైనారిటీ లేదా మెజారిటీ వాటా కలిగి ఉండే ప్రతిపాదన మంచిదే కావచ్చు. కానీ, దానికి విలువను తీసుకురాలేం’’ అని గంగ్వాల్‌ పేర్కొన్నారు. ఇక ఎయిరిండియా అంతర్జాతీయ ట్రాఫిక్‌ను గల్ఫ్‌ విమానయాన సంస్థలు సొంతం చేసుకోనున్నాయన్న వార్తలపై ఇండిగో ఆందోళనను వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన దేశీయ, అంతర్జాతీయ వియానయాన నెట్‌వర్క్‌ ఓ పరాయి దేశం నియంత్రణలోకి వెళ్లడం మన ప్రయోజనాలకు ఏ మాత్రం మంచిది కాదని ఇండిగో పేర్కొంది.

రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా కార్యకలాపాలు మొత్తం కొనుగోలు చేయాలని భావించడం లేదని ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ గ్రూప్‌ ఎండీ రాహుల్‌ భాటియా.. గురువారం  ఇన్వెస్టర్లకు వివరించారు. విదేశీ రూట్లలోనూ విస్తరించడం కోసం తాము కేవలం ఎయిరిండియా విదేశీ కార్యకలాపాలు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎయిరిండియా కొనుగోలు వల్ల తమకు విదేశీ మార్కెట్లలోకి కూడా చొచ్చుకుపోయేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఒకవేళ ఎయిరిండియా విదేశీ కార్యకలాపాలను కొనుగోలు చేసిన పక్షంలో తమదైన చౌక చార్జీల మోడల్‌లోనే నిర్వహణ ఉంటుందని భాటియా చెప్పారు. ఎయిరిండియా కొనుగోలు ద్వారా అంతర్జాతీయంగా తాము ఇప్పటిదాకా ప్రవేశించని కొత్త రూట్లు అందుబాటులోకి వస్తాయని, అంతర్జాతీయ విభాగం ఆదాయాలూ పెరుగుతాయని భాటియా చెప్పారు. ప్రస్తుతం ఇండిగో.. ఆసియాలో 7 ప్రాంతాలకే సర్వీసులు నడిపిస్తోంది.

41 విదేశీ రూట్లలో సర్వీసులు..
ఎయిరిండియాలో వాటాల విక్రయ ప్రతిపాదనపై కేంద్రం నిర్ణయం తీసుకున్న దరిమిలా వాటిని కొనుగోలు చేయడంపై ఇండిగో ఒక్కటే అధికారికంగా ప్రభుత్వాన్ని సంప్రదించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా కొనుగోలుపై టాటా గ్రూప్‌ కూడా ఆసక్తిగా ఉంది. ఎయిరిండియా అంతర్జాతీయంగా నాలుగు ఖండాల్లోని 41 ప్రాంతాలకు సర్వీసులు (ప్రారంభం కావాల్సిన నాలుగు రూట్లు కలిపి) నిర్వహిస్తోంది. అయితే, దేశీ మార్కెట్లో ఎయిరిండియా వాటా దశాబ్దం క్రితం 35 శాతంగా ఉండగా.. ఇప్పుడు 14 శాతానికి పడిపోయింది. 40 శాతం వాటాతో ఇండిగో అగ్రస్థానంలో, 16 శాతం వాటాతో జెట్‌ ఎయిర్‌వేస్‌ రెండో స్థానంలో ఉండగా.. ఎయిరిండియా మూడో స్థానంలో ఉంది.

సుదీర్ఘ విదేశీ రూట్లలోనూ ’చౌక’ విమానాలు..
ఎయిరిండియా కొనుగోలు ప్రతిపాదన అనుకున్న విధంగా జరిగినా, జరగకపోయినా.. సుదీర్ఘ ప్రయాణాలుండే అంతర్జాతీయ రూట్లలో సైతం చౌక చార్జీల విమానయాన సేవలను ప్రవేశపెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేశ్‌ గంగ్వాల్‌ తెలిపారు. లాభదాయకతపరంగా ప్రస్తుతం  పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఎయిరిండియాను వేర్వేరు విభాగాలుగా కాకుండా పూర్తిగా విక్రయించాలని ప్రభుత్వం భావించినా ఆసక్తికరంగానే ఉండగలదని భాటియా అభిప్రాయపడ్డారు. ఎయిరిండియా కొనుగోలులో అనేక సవాళ్లు, సంక్లిష్టమైన అంశాలూ ఉన్నాయని.. వీటన్నింటినీ అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

Advertisement
Advertisement