టోకు ధరలు ‘కూల్’... | Sakshi
Sakshi News home page

టోకు ధరలు ‘కూల్’...

Published Wed, Nov 16 2016 1:23 AM

టోకు ధరలు ‘కూల్’...

అక్టోబర్‌లో 3.39 శాతం
రేటు తగ్గింపునకు పరిశ్రమల డిమాండ్

 న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో కొంత శాంతించింది. సెప్టెంబర్‌లో 3.57%గా ఉన్న ఈ రేటు అక్టోబర్‌లో 3.39%కి దిగివచ్చింది. అంటే సెప్టెంబర్‌లో ఉన్న ఆహార ధరల పెరుగుదల వేగం (గత ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) అక్టోబర్‌లో తగ్గిందన్నమాట. ఆహార ధరలు అదుపులో ఉండడం దీనికి ఒక కారణం. గత ఏడాది ఇదే నెలలో ఆహార ద్రవ్యోల్బణం అసలు పెరుగుదలలో లేకపోగా -3.70% క్షీణతలో ఉంది. తాజాగా ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 7 ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించాలని పరిశ్రమలు డిమాండ్ చేస్తున్నారుు.

ముఖ్య విభాగాలను వార్షికంగా చూస్తే...
ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 0.04% నుంచి 3.31 %కి పెరిగింది. ఇందులో ఒక భాగమైన ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 3.33% నుంచి 4.34%కి చేరింది. సెప్టెంబర్‌లో ఈ బాస్కెట్‌లో ధరల పెరుగుదల వేగం 5.75%. ఇక నాన్-ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 5.10% నుంచి 1.13%కి తగ్గింది.

ఫ్యూయెల్ అండ్ పవర్: -16.32% క్షీణత నుంచి 6.18%కి ఎగసింది.

తయారీ: మొత్తం సూచీలో 60% ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం -1.67% క్షీణత నుంచి 2.67%కి పెరిగింది.

 పరిశ్రమలు ఏమంటున్నాయంటే...
ప్రస్తుత పరిస్థితుల్లో రెపో కోత 0.50% అవసరమని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్థన్ నోతియా పేర్కొన్నారు. హౌసింగ్, ఆటోమోబైల్, వినియోగ వస్తువుల విభాగాల్లో పెరుగుదలకు తక్షణం ఈ చర్య తీసుకోవాలని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు వచ్చే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత తగ్గుదలకు దోహదపడుతుందని ఐసీఆర్‌ఏ సీనియర్ ఎకనమిస్ట్ అదితినయ్యర్ అన్నారు.

Advertisement
Advertisement