విశాల్‌సిక్కాకు దెబ్బ మీద దెబ్బ | Sakshi
Sakshi News home page

విశాల్‌సిక్కాకు మరో భారీ ఎదురుదెబ్బ

Published Wed, Jul 26 2017 3:37 PM

విశాల్‌సిక్కాకు దెబ్బ మీద దెబ్బ

బెంగళూరు : ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవలే కంపెనీ లార్జ్‌ డీల్స్‌ బాస్‌ రితికా సూరి ఇన్ఫీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో టాప్‌-లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌ కూడా కంపెనీని వీడారు. కంపెనీ కొత్త డిజిటల్‌, నూతనావిష్కరణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్న ఇన్ఫోసిస్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ అధినేత యూసఫ్‌ బషీర్‌ కంపెనీకి రాజీనామా చేసినట్టు తెలిసింది. 2015 మార్చిలో ఇన్ఫోసిస్‌లో చేరకముందు నుంచి బషీర్‌కు, విశాల్‌ సిక్కాకు ఎంతో దగ్గరి సంబంధాలున్నాయి. అప్పట్లో జర్మన్‌ దిగ్గజం ఎస్‌ఏపీలో బషీర్‌ కొత్త ప్రొడక్ట్‌ల వైస్‌-ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు.
 
కంపెనీకి చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ లార్జ్‌ డీల్స్‌ బాస్‌ రితికా సూరీ కూడా ఈ మధ్యనే ఇన్ఫీకి రాజీనామా చేశారు. ఆమె కంపెనీల కొనుగోళ్ళు, విలీనాల్లో దిట్టగా వ్యవహరించేవారు. బషీర్‌ కూడా ఈ నెల మొదట్లోనే తన రాజీనామా పత్రాలను సమర్పించినట్టు రిపోర్టులు చెప్పాయి. ఎస్‌ఏపీలో అసోసియేట్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ ర్యాంకు కలిగిన 16 మంది ఎగ్జిక్యూటివ్‌లను ఇన్ఫోసిస్‌ నియమించుకున్న సంగతి తెలిసిందే. వారిలో బషీర్‌ కూడా ఒకరు. 2014 ఆగస్టులో విశాల్‌ సిక్కా, ఇన్ఫోసిస్‌కు సీఈవోగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి గతేడాది మార్చి వరకు కనీసం తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడినట్టు తెలిసింది.
 
రితికా సూరి, బషీర్‌, మరో మాజీ ఎస్‌ఏసీ ఎగ్జిక్యూటివ్‌ కలిసి, ఇన్ఫోసిస్‌ కొత్త డిజిటల్‌ వరల్డ్‌కు ఎంతో సహకరించారు. రితికా సూరి, మూడు కొనుగోళ్లను విజయవంతంగా పూర్తిచేస్తే, బషీర్‌ 12 స్టార్టప్‌ ఇన్వెస్ట్‌మెంట్లను చేపట్టారు. కానీ గత ఏడాదిగా కంపెనీలో ఎలాంటి మేజర్‌ డీల్స్‌ లేవు. గతేడాది జూలైలో రితికా సూరి ఎంఅండ్‌ఏ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి కొనుగోళ్లను చేపట్టలేదు. బషీర్ చివరి ఇ‍న్వెస్ట్‌మెంట్‌ కూడా 2016 డిసెంబర్‌లోనే. ఇక అప్పటి నుంచి ఎలాంటి లావాదేవీలు లేవు.  

Advertisement
Advertisement