జేఎస్‌డబ్ల్యూ విజయనగరం సెజ్ సరెండర్! | Sakshi
Sakshi News home page

జేఎస్‌డబ్ల్యూ విజయనగరం సెజ్ సరెండర్!

Published Wed, Feb 11 2015 2:12 AM

జేఎస్‌డబ్ల్యూ విజయనగరం సెజ్ సరెండర్! - Sakshi

- ఇదే వరుసలో మరో 56...
- ఆర్థిక మందగమనం, పన్ను సమస్యలు ప్రధాన కారణం...

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఎస్ కోట వద్ద తమ ప్రత్యేక ఆర్థిక జోన్ (ఎస్‌ఈజెడ్- సెజ్)ను ప్రభుత్వానికి సరెండర్ చేసేయడానికి డెవలపర్ జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ సిద్ధమయ్యింది. దాదాపు 240 హెక్టార్లలో ప్రతిపాదించిన ఈ సెజ్ అల్యూమినియం రంగానికి ఉద్దేశించారు. ఈ సెజ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన అనుమతుల గడువు నిజానికి 2012 ఫిబ్రవరి 26తో ముగిసింది. ముడి ఖనిజం మైనింగ్‌కు పర్యావరణ పరమైన ఆమోదాలు లభించకపోవడం, బాక్సైట్ సరఫరా ఒప్పందాల సంతకాలు పెండింగులో ఉండడం వంటి అంశాల వల్ల ఈ సెజ్ అభివృద్ధికి అవాంతరాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో సెజ్‌ను సరెండర్ చేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.
 
20న కీలక సమావేశం...
జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియంసహా దాదాపు 56 పత్యేక ఆర్థిక జోన్లల పట్ల ఇన్వెస్టర్లు అనాసక్త ధోరణిలో ఉన్నారని సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఆయా సెజ్‌ల డెవలపర్లు తమ సెజ్ ఆమోదిత అప్లికేషన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు.  పార్శ్వనాథ్, డీఎల్‌ఎఫ్ వంటి  సంస్థలు  ఉన్నాయి. వీటికి సంబంధించి న్యూఢిల్లీలో ఫిబ్రవరి 20న జరిగే ఒక అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
 
నిరుత్సాహానికి కారణం!
50కి పైగా సెజ్ డెవలపర్లు ఇప్పటికే తమ ప్రాజెక్టులను సరెండర్ చేశారు.ఆర్థిక  మందగమనంలో ఉండడం వల్ల పలు డెవలపర్లు సెజ్‌ల అభివృద్ధి విషయంలో పలు అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఆయా పరిస్థితుల నేపథ్యంలో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ (ఎంఏటీ), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్  వంటి అంశాలు సెజ్‌లకు విఘాతంగా మారినట్లు విమర్శలు ఉన్నాయి. దేశంలో ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఆవిర్భవించిన సెజ్‌లు ఆయా ప్రతికూల అంశాల వల్ల క్రమంగా తమ ఆకర్షణను కోల్పోతున్నాయన్న విమర్శ ఉంది.

పెట్టుబడుల పెంపునకు రానున్న బడ్జెట్  సెజ్‌లపై మ్యాట్‌ను ప్రస్తుత 18.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ఇటీవల పరిశ్రమల సంఘం- సీఐఐ కేంద్రానికి తన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో విన్నవించింది. 2005-06లో ఈ జోన్ల నుంచి ఎగుమతుల విలువ దాదాపు రూ.22,840 కోట్లు.  2013-14 నాటికి ఈ విలువ రూ.4.94 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల విలువను దాదాపు రూ.20.15 లక్షల కోట్లకు పెంచాలన్నది ప్రణాళిక. ఈ పరిస్థితుల్లో సెజ్‌ల వైపు నుంచి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.

Advertisement
Advertisement