ఇక భారత్‌లో ఎఫ్‌–16 ఫైటర్‌ జెట్స్‌ తయారీ! | Sakshi
Sakshi News home page

ఇక భారత్‌లో ఎఫ్‌–16 ఫైటర్‌ జెట్స్‌ తయారీ!

Published Tue, Jun 20 2017 12:08 AM

ఇక భారత్‌లో ఎఫ్‌–16 ఫైటర్‌ జెట్స్‌ తయారీ!

టాటా గ్రూప్, లాక్‌హీడ్‌ మార్టిన్‌ల మధ్య ఒప్పందం
భారత్, అమెరికాలో ఉద్యోగాలకు ఊతం


లండన్‌: అత్యాధునిక ఎఫ్‌–16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌(టీఏఎస్‌ఎల్‌), అమెరికన్‌ ఏరోస్పేస్‌ దిగ్గజం లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిస్‌ ఎయిర్‌షో సందర్భంగా కంపెనీలు ఈ విషయం వెల్లడించాయి. భారత ప్రభుత్వ మేకిన్‌ ఇండియా నినాదానికి ఊతమిచ్చే ఈ డీల్‌ ప్రకారం లాక్‌హీడ్‌ అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం ఫోర్ట్‌ వర్త్‌లో ఉన్న ప్లాంటు కార్యకలాపాలను భారత్‌కు తరలించనుంది. ఈ క్రమంలో అక్కడి అమెరికన్ల ఉద్యోగుల ఉపాధికి ప్రత్యక్షంగా భంగం కలగకుండా చర్యలు తీసుకోనుంది.

మేకిన్‌ ఇండియా నినాదానికి ప్రాధాన్యమిస్తున్న ప్రధాని మోదీ, అమెరికన్లకే ఉద్యోగాల నినాదానికి ప్రాధాన్యమిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో భేటీ కానున్న నేపథ్యంలో ఈ డీల్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా, లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఓర్లాండో కర్వాలో సమక్షంలో టీఏఎస్‌ఎల్‌ సీఈవో సుకరణ్‌ సింగ్, లాక్‌హీడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జార్జ్‌ స్టాండ్‌ రిడ్జ్‌ దీనిపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం ఈ డీల్‌తో మరింత పటిష్టం కాగలదని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. ఎఫ్‌–16ల తయారీకి సంబంధించి ఇదొక అపూర్వమైన ఒప్పందమని ఓర్లాండో పేర్కొన్నారు. టీఏఎస్‌ఎల్‌ ఇప్పటికే లాక్‌హీడ్‌కి చెందిన సీ–130జే ఎయిర్‌లిఫ్టర్, ఎస్‌–92 హెలికాప్టర్‌లకు ఎయిర్‌ఫ్రేమ్‌ విడిభాగాలు అందజేస్తోంది.

ఉపాధికి తోడ్పాటు..: భారత వైమానిక దళానికి అవసరమైన సింగిల్‌ ఇంజిన్‌ ఫైటర్‌ విమానాల అవసరాలు తీర్చేందుకు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్, లాక్‌హీడ్‌ భాగస్వామ్యం తోడ్పడనుంది. భారత ఎయిర్‌ఫోర్స్‌కు ఈ తరహా విమానాలు సుమారు 200 అవసరమని రక్షణ రంగ నిపుణుల అంచనా. అత్యంత ఆధునిక ఎఫ్‌–16 బ్లాక్‌ 70 విమానాల తయారీ, నిర్వహణ, ఎగుమతికి ఈ డీల్‌ ద్వారా భారత్‌కు అవకాశం లభించగలదని టాటా సన్స్‌ పేర్కొంది.

అలాగే, ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌కు ప్రముఖ స్థానం దక్కగలదని వివరించింది. భారత్‌లో ఎఫ్‌–16 విమానాల తయారీ ఇటు దేశీయంగా తయారీ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అటు అమెరికాలోనూ వేల కొద్దీ ఉద్యోగాల కల్పనకు ఊతమివ్వగలదని ఓర్లాండో తెలిపారు.  ఇప్పటిదాకా సుమారు 4,500 పైగా ఎఫ్‌–16 యుద్ధ విమానాలు ఉత్పత్తి కాగా, 26 దేశాల్లో 3,200 పైచిలుకు విమానాలు నడుస్తున్నాయి.

Advertisement
Advertisement