‘మెర్సిడెస్‌’దే లగ్జరీ కార్‌ మార్కెట్‌.. | Sakshi
Sakshi News home page

‘మెర్సిడెస్‌’దే లగ్జరీ కార్‌ మార్కెట్‌..

Published Tue, Jan 9 2018 1:32 AM

Luxury car Mercedes Benz in the market - Sakshi

న్యూఢిల్లీ: దేశీ లగ్జరీ కార్‌ మార్కెట్‌లో మెర్సిడెస్‌ బెంజ్‌ తన హవా కొనసాగిస్తోంది. వరుసగా మూడోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పలు సవాళ్లను అధిగమించి మరీ 2017లో ఏకంగా 15,330 కార్లు, ఎస్‌యూవీలను విక్రయించింది. కంపెనీ కార్ల విక్రయాలు 2016లో 13,231 యూనిట్లుగా ఉన్నాయి. అంటే వార్షిక ప్రాతిపదికన 15.86 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనికి కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ బాగా దోహదపడింది.

మెర్సిడెస్‌ ప్రత్యర్థులైన బీఎండబ్ల్యూ, ఆడి కార్ల విక్రయాలను ఒకసారి పరిశీలిస్తే... 2017లో బీఎండబ్ల్యూ గ్రూప్‌ విక్రయాలు 9,800 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ 2016లో 7,861 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇక ఆడి కార్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 7,720 యూనిట్ల నుంచి 7,876 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) విక్రయాలు 3,954 యూనిట్లుగా ఉన్నాయి. 2016లో దీని అమ్మకాలు 2,653 యూనిట్లు. అంటే 49 శాతం వృద్ధి నమోదయ్యింది.

‘గతేడాదిలో పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంది. అయినా మేం రికార్డ్‌ స్థాయిలో 15,330 యూనిట్లను విక్రయించాం’ అని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో రోనాల్డ్‌ ఫోల్గర్‌ చెప్పారు. జీఎస్‌టీ అమలు తర్వాత పన్ను రేట్లలో మార్పులు చేయడం వల్ల లగ్జరీ విభాగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. దేశీ లగ్జరీ కార్ల విభాగంలో దాదాపు 40 శాతం మార్కెట్‌ వాటాను తాము సాధించినట్లు ఆయన తెలియజేశారు.


కంపెనీ                       విక్రయాలు
                         2017        2016    వృ/క్షీ
మెర్సిడెస్‌ బెంజ్‌      15,330    13,231    16
బీఎండబ్ల్యూ            9,800     7861      25
ఆడి                     7,876     7,720       2
జేఎల్‌ఆర్‌              3,954      2,653     49

Advertisement
Advertisement