ఓటేస్తే బహుమతి | Sakshi
Sakshi News home page

ఓటేస్తే బహుమతి

Published Sat, Apr 5 2014 1:43 AM

ఓటేస్తే బహుమతి

న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటోంది. టాటా, బిర్లా, హీరో, ఇన్ఫోసిస్ వంటి బడా కార్పొరేట్ దిగ్గజాలు తమ సిబ్బందితో పాటు సాధారణ పౌరులు కూడా ఓటు వేసేలా చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఓటు హక్కును వినియోగించుకున్న ఉద్యోగులకు బహుమతులను, ప్రోత్సాహకాలను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పోలింగ్ రోజు కావాలంటే సెలవు తీసుకోండి... కనీసం ఒక పూటైనా లీవు తీసుకుని ఓటు వేసి రండని చెబుతున్నాయి. అంతేనా, అనేక కంపెనీలు ఓటరు నమోదు ప్రక్రియకు ఇతోధికంగా దోహదపడుతున్నాయి. ఓటు వేసేలా ఉద్యోగులను ప్రేరేపించేందుకు దృశ్య, శ్రవణ కార్యక్రమాలు, పోస్టర్లతో పాటు ఓటు హక్కు వినియోగించుకున్న వారి అనుభవాలను కూడా కంపెనీలు వివరిస్తున్నాయి. ఓటు హక్కు వినియోగంలో ప్రజల్లోని ఉదాశీనతను పోగొట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి.

 టాటా భారీ ప్రచారం...
 భారతీయ మహిళా ఓటర్లలో చైతన్యం నింపేందుకు ‘పవర్ ఆఫ్ 49’ పేరుతో సృజనాత్మక ప్రచార కార్యక్రమాన్ని టాటా గ్రూప్ చేపట్టింది. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 49% కావడంతో ప్రచారానికి ఆ పేరు పెట్టింది.

 ఓటర్ల నమోదులో ఇన్ఫోసిస్ ...
 బెంగళూరులో ఓటు హక్కుపై చైతన్యాన్ని పెంచేందుకు ఇన్ఫోసిస్ నడుం బిగించింది.  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం ఓ రిసోర్స్ హబ్‌నూ ఏర్పాటు చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయంతో కలసి ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, క్విజ్‌లు, ఎస్‌ఎంఎస్ ప్రచారం వంటి పలు కార్యక్రమాలను నిర్వహించింది. కాగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ కూడా ఓటు హక్కుపై భారీ ప్రకటనలతో ప్రచారాన్ని చేపట్టింది. ఐడియా సెల్యులార్, హీరో మోటోకార్స్, ఐటీసీ, టాటా టీ, గూగుల్ ఇండియా, ఎంటీవీ ఇండియా వంటి కంపెనీలు కూడా ఇలాంటి పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి.

Advertisement
Advertisement