హైదరాబాద్‌లో మెట్రో కొత్త స్టోర్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మెట్రో కొత్త స్టోర్‌

Published Sat, Mar 18 2017 1:07 AM

హైదరాబాద్‌లో మెట్రో కొత్త స్టోర్‌ - Sakshi

మే నెలలో ప్రారంభానికి సన్నాహాలు
ఈ ఏడాదే వరంగల్‌లో స్టోర్‌
2018లో వైజాగ్, గచ్చిబౌలిలో
 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హోల్‌సేల్‌ వ్యాపారంలో ఉన్న మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ హైదరాబాద్‌లో మరో ఔట్‌లెట్‌ను తెరుస్తోంది. కొంపల్లి సమీపంలోని సుచిత్ర వద్ద ఈ స్టోర్‌ను మే నెలలో ప్రారంభిస్తోంది. దీంతో తెలంగాణలో కంపెనీ ఔట్‌లెట్ల సంఖ్య నాలుగుకు చేరుకోనుంది. 67,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటవుతోంది. రూ.150 కోట్ల దాకా ఖర్చు చేసినట్టు సమాచారం. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, సౌందర్య సాధనాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌ వంటి 10,000 రకాల ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి. కొత్త స్టోర్‌తో ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుందని కంపెనీ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వెల్లడించారు. ఇప్పటికే సంస్థకు భాగ్యనగరిలో మూసాపేట్, ఉప్పల్, గగన్‌ పహాడ్‌ వద్ద కేంద్రాలున్నాయి. విజయవాడలో ఒక సెంటర్‌ను నిర్వహిస్తోంది.

2020 నాటికి 50 కేంద్రాలు..: మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీకి బెంగళూరులో ఆరు కేంద్రాలున్నాయి. ఈ నగరం తర్వాత అత్యధికంగా స్టోర్లను నిర్వహిస్తున్నది హైదరాబాద్‌లోనే.  గచ్చిబౌలిలో స్థలాన్ని కొనుగోలు చేసింది కూడా. వచ్చే ఏడాది ఈ ఔట్‌లెట్‌ అందుబాటులోకి రానుంది. ఇక వరంగల్‌లో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో కేంద్రం ప్రారంభం అవుతోంది. 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటవుతోంది. వైజాగ్‌లో 2018లో ఔట్‌లెట్‌ రెడీ కానుంది.

అహ్మదాబాద్‌లో ఈ సంవత్సరమే స్టోర్‌ను ప్రారంభిస్తోంది. మెట్రోకు దేశవ్యాప్తంగా 23 ఔట్‌లెట్లు ఉన్నాయి. 2020 నాటికి 50 స్టోర్లను తెరవాలన్నది లక్ష్యం. ఒక్కో కేంద్రానికి రూ.100–150 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. 10 లక్షలు ఆపై జనాభా ఉన్న నగరాల్లో అడుగు పెట్టాలన్నది సంస్థ ధ్యేయం. ప్రతి కేంద్రంలో 10,000 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 1,100లకుపైగా రకాలు మెట్రో సొంత బ్రాండ్లలో విక్రయిస్తోంది.

Advertisement
Advertisement