వేతన జీవులకు ఊరట..?

30 Jun, 2019 17:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జులై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై వివిద వర్గాలు పలు అంచనాలతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి ప్రస్తుత రూ 2.5 లక్షల నుంచి పెంచాలని కేపీఎంజీ ఇండియా నిర్వహించిన ప్రీ బడ్జెట్‌ సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కోరారు. ఇక రూ 10 కోట్ల పైబడిన వార్షికాదాయం కలిగిన సంపన్నులపై 40 శాతం పన్ను రేటు విధించాలని కూడా పలువురు కోరారు.

వివిధ పరిశ్రమలకు చెందిన 226 మందిని ప్రీ బడ్జెట్‌ సర్వేలో భాగంగా కేపీఎంజీ పలుకరించింది. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ 2.5 లక్షల నుంచి పెంచాలని 74 శాతం మంది అభిప్రాయపడగా, రూ 10 కోట్ల పైబడిన ఆదాయం కలిగిన వారిపై 40 శాతం పన్ను రేటు వర్తింపచేయాలని 58 శాతం మంది కోరడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వం వెల్త్‌ ట్యాక్స్‌ లేదా ఎస్టేట్‌ సుంకాన్ని తిరిగి ప్రవేశపెట్టవచ్చని 10 శాతం మంది అంచనా వేశారు. ఇక వారసత్వ పన్ను కూడా తిరగతోడతారని 13 శాతం మంది పేర్కొన్నారు. ఇక గృహరుణంపై వడ్డీకి పన్ను డిడక్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ 2 లక్షల నుంచి ప్రభుత్వం పెంచాలని సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది కోరారు.

మరిన్ని వార్తలు