కొత్త రూ.10 నోట్లు, మరి పాత నోట్ల సంగతేంటి? | Sakshi
Sakshi News home page

కొత్త రూ.10 నోట్లు, మరి పాత నోట్ల సంగతేంటి?

Published Thu, Jan 4 2018 9:48 AM

New Rs 10 notes to be chocolate coloured - Sakshi

ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కొత్త రూ.10 నోట్లు జారీచేయడానికి సిద్ధమవుతోంది. చాకోలెట్‌ బ్రౌన్‌ రంగులో మహాత్మా గాంధీ సిరీస్‌లో ఈ నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిసింది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కొత్త నోటుపై కొణార్క్‌ సూర్య దేవాలయం, మహాత్మాగాంధీ చిత్రం, అశోక్‌ స్తంభం, స్వచ్ఛ భారత్‌ లోగో వంటి ఫీచర్లు ఉండనున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. కొత్త నోట్లు తీసుకొస్తున్నప్పటికీ, గతంలో తీసుకొచ్చిన అన్ని రూ.10 నోట్లూ చెల్లుబాటు అవుతాయని తెలిపింది. సెంట్రల్‌ బ్యాంకు ఇప్పటికే ఈ కొత్త నోట్లను 1 బిలియన్‌ పీసులను  ప్రింట్‌ చేసినట్టు ఈ విషయం తెలిసిన అధికారులు చెప్పారు. కొత్త రూ.10 నోటుకు సంబంధించి డిజైన్‌ను కూడా ప్రభుత్వం గత వారంలోనే ఆమోదించిందని తెలిపారు. 

ప్రస్తుతం మారుస్తున్న పాత రూ.10 నోటు డిజైన్‌ను 2015లో రూపొందించారు. గతేడాది ఆగస్టులో మహాత్మాగాంధీ సిరీస్‌లో ఆర్‌బీఐ కొత్త రూ.200, రూ.50 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నకిలీలకు వ్యతిరేకంగా ఆర్‌బీఐ కొత్త డిజైన్‌లో తక్కువ డినామినేషన్‌ నోట్లను పునఃప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కొత్త రూ.10 నోట్లు, కొత్త డిజైన్‌లో మార్కెట్‌లోకి వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. నకిలీలను, అవినీతిని నిర్మూలించడానికే 2016 నవంబర్‌ 8న ప్రభుత్వం పెద్దనోట్లు రూ.1000, రూ.500ను రద్దు చేసింది. చలామణిలో ఉ‍న్న 86 శాతం కరెన్సీని వెనక్కితీసుకుంది. అప్పటి నుంచి కొత్త నోట్లను ప్రవేశపెట్టడం, పాత వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం చేస్తున్నాయి. డిసెంబర్‌ 8 నాటికి ఆర్‌బీఐ 16.96 బిలియన్‌ పీసుల రూ.500 నోట్లు, 3.6 బిలియన్‌ పీసుల రూ.2000నోట్లను ప్రింట్‌ చేసినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ లోక్‌సభలో తెలిపింది. ఈ నోట్ల మొత్తం విలువ రూ.15.79 ట్రిలియన్లు. 


   

Advertisement
Advertisement