ఓబీసీ నికర లాభం 310 కోట్లు | Sakshi
Sakshi News home page

ఓబీసీ నికర లాభం 310 కోట్లు

Published Thu, May 1 2014 1:14 AM

ఓబీసీ నికర లాభం 310 కోట్లు - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) క్యూ4(జనవరి-మార్చి)లో నామమాత్ర వృద్ధితో రూ. 310 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 308 కోట్లను ఆర్జించింది. మొండిబకాయిలకు కేటాయింపులు పెరగడం, అధిక పన్ను చెల్లింపుల కారణంగా లాభాలు పరిమితమైనట్లు బ్యాంకు చైర్మన్ ఎస్‌ఎల్ బన్సల్ పేర్కొన్నారు. ఈ కాలంలో మొండిబకాయిల ప్రొవిజన్లు రూ. 498 కోట్ల నుంచి రూ.728 కోట్లకు పెరిగాయి.

 వడ్డీ ఆదాయం 8% అప్
 ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) దాదాపు 8% పుంజుకుని రూ. 1,309 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ. 4,565 కోట్ల నుంచి రూ. 5,655 కోట్లకు ఎగసింది. కాగా, నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 2.72% నుంచి 2.78%కు బలపడ్డాయి. మరోవైపు నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.27% నుంచి 2.82%కు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 3.60 తుది డివిడెండ్‌ను బ్యాంకు బోర్డు ప్రతిపాదించింది. కాగా, పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంకు నికర లాభం 14% క్షీణించి రూ. 1,139 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాదిలో రూ. 1,328 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయితే ఆదాయం మాత్రం రూ. 19,359 కోట్ల నుంచి రూ. 20,963 కోట్లకు పుంజుకుంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంకు షేరు 1% తగ్గి రూ. 247 వద్ద ముగిసింది.
 

Advertisement
Advertisement