Sakshi News home page

ఈపీఎఫ్ ఉపసంహరణలపై మరో మెలిక

Published Tue, Apr 19 2016 11:23 AM

ఈపీఎఫ్ ఉపసంహరణలపై మరో మెలిక - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ (భవిష్య నిధి) విత్ డ్రాయల్స్‌పై ప్రతిపాదించిన పన్నుపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం, ఉపసంహరణలపై  మరో మెలిక పెట్టింది. సోమవారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సహకారం ఉపసంహరణకు సంబంధించిన  పరిమితులను  సడలిస్తూ కార్మిక శాఖ  ఆదేశాలు జారీ చేసింది. ఇకముందు కొన్ని ప్రత్యేక కారణాలతో   ఈపీఎఫ్ ఖాతాలోని పూర్తి సొమ్ము ఉపసంహరణకు  అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ తాజా  మార్పుల ప్రకారం ఇకముందు ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణకు ఖాతాదారుడు ఇల్లు కట్టుకోవడం, లేదా కొనడం, (హౌసింగ్) స్వీయ లేదా  కుటుంబ సభ్యులు, పిల్లలకు దంత వైద్యం సహా ఇతర వైద్య  ఖర్చులు నిమిత్తం,  ఇంజనీరింగ్ విద్యకు  లాంటి కారణాలపై మాత్రమే అనుమతిని మంజూరు చేసింది.  దీంతోపాటుగా చందాదారుని పెళ్లి సమయంలో కూడా  ఈ సొమ్ము విత్ డ్రా కు  అనుమతి వుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


 చందాదారులు (అతడు లేక ఆమె) పూర్తి సంతృప్తికర  సమాచారాన్ని అందించిన  తరువాత, అప్పటివరకు  ఖాతాలో ఉన్న  సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తామని మంత్రిత్వ వర్గాలు  ప్రకటించాయి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సభ్యులకు,  సహాయక ప్రావిడెంట్ ఫండ్ లేదా వృద్ధాప్య పెన్షన్ల సభ్యులకు ఇది  విస్తరించబడిందనీ,  ఈ ఆగస్టు నుంచి  ఈ నిబంధనలను  అమలులోకి వస్తాయని తెలిపింది. కార్మిక సంఘాల ప్రాతినిధులతో,  కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ   చేసిన విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో మంత్రి అరుణ్ జైట్టీ పేర్కొన్నారు. దీనిపై దేశంలోని ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళనకు దిగడంతో ఆ ప్రతిపాదను విరమించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement