వీడిన వాళ్లకు జోక్యం చేసుకునే హక్కులేదు | Sakshi
Sakshi News home page

వీడిన వాళ్లకు జోక్యం చేసుకునే హక్కులేదు

Published Sat, Aug 19 2017 12:12 AM

వీడిన వాళ్లకు జోక్యం చేసుకునే హక్కులేదు

బీవీఆర్‌ మోహన్‌రెడ్డి
హైదరాబాద్‌: 
విశాల్‌ సిక్కా వంటి మంచి సీఈవో గొప్ప సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ను వీడడం బాధాకరమని నాస్కాం మాజీ చైర్మన్, సైయంట్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కంపెనీని వీడిన తర్వాత ప్రమోటర్లకు అట్టి సంస్థలో జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటన పశ్చిమ దేశాల్లో జరిగితే వాటాదారులు కంపెనీపై కోర్టులో దావా వేస్తారని అన్నారు. 12.8 శాతం వాటా ఉన్నవారు సమస్య సృష్టిస్తే, 87.5 శాతం వాటాదారులు ఇబ్బంది పడతారని తెలిపారు.   

బైబ్యాక్‌ యథాతథం..
సిక్కా రాజీనామా కారణంగా కంపెనీ ప్రతిపాదించిన షేర్ల బైబ్యాక్‌(దాదాపు రూ.13,000 కోట్లు) ప్రణాళికల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని ఇన్ఫీ ప్రకటించింది. బైబ్యాక్‌పై నిర్ణయం కోసం కంపెనీ నేడు(శనివారం) బోర్డు సమావేశం నిర్వహించనున్న  సంగతి తెలిసిందే.

చైర్మన్‌గా నీలేకని రావాలి..
ఇన్ఫోసిస్‌ బోర్డు తమ సీఈవోను కాపాడుకోలేకపోయిందని ది ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ (ఐఐఏఎస్‌) వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బోర్డులో చేరేలా ఇన్ఫీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్‌ నీలేకనిని సంస్థ ఒప్పించాలని సూచించింది. దేశ ఐటీ రంగానికి ఇన్ఫోసిస్‌ గుండెలాంటిది కాబట్టి నీలేకని కూడా దీన్ని కార్పొరేట్‌ ఉద్యోగంలాగా భావించకుండా తన వంతు కృషి చేయాలని పేర్కొంది. ‘ఎప్పటికప్పుడు టెక్నాలజీలో మారిపోయే కొత్త ధోరణులను ఆయన అందిపుచ్చుకున్నారు.

దేశాన్ని డిజిటలైజ్‌ చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు అధికారుల్లోను, అంతర్జాతీయంగా నాయకులతోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. పైగా ఇన్ఫీ ఆవిర్భావం నుంచి ఉన్నందున.. ఇటు కంపెనీ సంస్కృతితో పాటు అటు వ్యవస్థాపకుల ఆలోచనా ధోరణులపై ఆయనకు మంచి అవగాహన ఉంటుంది‘ అని ఐఐఏఎస్‌ తెలిపింది. ఇన్ఫీ గెలుపు.. భవిష్యత్‌లో దేశీ ఐటీ పరిశ్రమ దిశానిర్దేశాన్ని సూచించగలదని ఐఐఏఎస్‌ తెలిపింది.

మరోవైపు, సిక్కా సారథ్యంలో కంపెనీ మెరుగ్గా రాణించినప్పటికీ.. 2020 నాటికల్లా 20 బిలియన్‌ డాలర్ల ఆదాయమంటూ ఆయన స్వయంగా విధించుకున్న లక్ష్యానికి దరిదాపుల్లో లేదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ (పీసీజీ విభాగం) వీకే శర్మ వ్యాఖ్యానించారు. అటు ప్రస్తుత పరిణామాల ప్రభావం తాత్కాలికమేనని సమస్యలను అధిగమించి ఇన్ఫీ స్టాక్‌ మళ్లీ పుంజుకోగలదని ఏంజెల్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌ విభాగం) సరబ్‌జిత్‌ కౌర్‌ నంగ్రా అభిప్రాయపడ్డారు. 

Advertisement
Advertisement