ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేయనున్నారా? | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేయనున్నారా?

Published Wed, Oct 31 2018 8:10 AM

RBI governor Urjit Patel may consider resigning: sources - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు మధ్య విభేదాలు  తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవ‍ర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా బ్యాంకు స్వతంత్రత, ప్రభుత్వ బ్యాంకులపై దానికి పూర్తి పెత్తనం లేకపోవటం మీద తాజాగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. ఈ నేపథ్యంలో  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆర్‌బీఐ  వ్యవహారాలపై చేసిన దాడి, తదితర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో ఆర్‌బీఐ గవర్నర్‌  తన రాజీనామా అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.  గత దశాబ్దకాలంలో ఆర్‌బీఐ గవర్నర్లకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవటానికి ప్రధానాంశంగా  నిలిచిన బ్యాంకుల లిక్విడిటీ అంశమే మరోసారి కీలకంగా మారింది.  ఈ క్రమంలో ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేంద్రం చర్యలు తీసుకుంటుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత లిక్విడిటీ పెంచాలన్న కేంద్ర వాదనను ఆర్‌బీఐ తిరస్కరిస్తోంది. అలాగే పేమెంట్స్‌ రెగ్యులేటరీ కమిటీకి ఆర్‌బీఐ విముఖత వ్యక్తం చేసింది. నీరవ్‌మోదీ కుంభకోణంపై కేంద్రంపై తీవ్రవిమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఈ స్కాంను నిరోధించడంలో  ఆర్‌బీఐ  ఫెయిల్‌ అయిందని కేంద్రం ఆరోపిస్తోంది. ఇలా వివాదం ముదురుతూ వస్తోంది. ఇది ఇలా ఉండగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య తాజాగా వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోసాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్‌బీఐ పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేకపోతోంది. మేనేజ్‌మెంట్‌ను మార్చాలన్నా, బోర్డును తొలగించాలన్నా, లైసెన్సు రద్దు  చేయాలన్నా, బ్యాంకుల విలీనమైనా లేదా వేరే బ్యాంకుకు అప్పగించే ప్రయత్నమైనా..ఇలా ఏ అంశమైనా సరే.. ప్రైవేటు బ్యాంకుల విషయంలో స్పందించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో స్పందించడం ఆర్‌బీఐకి సాధ్యం కావడంలేదు’ అని విరాల్‌ ఆచార్య గతవారం ముంబైలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా  అరుణ్‌ జైట్లీ బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలిచ్చేస్తుంటే కట్టడి చేయకుండా సెంట్రల్‌ బ్యాంక్‌ చోద్యం చూస్తూ కూర్చుందంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.  ఈ రుణాలే పెరిగి, పెద్దవై ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో మొండిబాకీల సంక్షోభానికి దారితీశాయని ఎదురు దాడికి దిగారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఆర్‌బీఐ గవర్నర్లుగా వ్యవహరించిన వారు ఎన్నో సందర్భాల్లో బ్యాంకులపై నియంత్రణ విషయంలో తమకు తగినంత స్వేచ్ఛ లేదని గతంనుంచి వినిపిస్తున్న వాదనే.  ఆర్‌బీఐకి పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని పలువురు బ్యాంకింగ్‌ నిపుణులు వివిధ సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆర్‌బీఐ పాలసీలపై ప్రభుత్వం  విమర్శలు కూడా ఇదే మొదటిసారి కాదు. ఈ క్రమంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్ రాజీనామా చేసిన సంగతి  తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు సార్లు ఆర్‌బీఐ గవర్నర్లు రాజీనామా ఉదంతాలు చోటు చేసుకున్నాయి. 

Advertisement
Advertisement