బ్యాంకులకు ఇం‘ధనం’! | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు ఇం‘ధనం’!

Published Thu, May 15 2014 12:50 AM

బ్యాంకులకు ఇం‘ధనం’!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానున్న కొద్ది రోజుల ముందు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటా తగ్గింపుపై ఆర్‌బీఐ ప్యానల్ చేసిన సూచనల ప్రభావంతో బుధవారం పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ కమిటీ నిబంధనలు అమలు చేయాల్సి వస్తే ముందుగా ఏ బ్యాంకులను ఎంచుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. అధిక వాటా కలిగి ఉన్న సెంట్రల్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంకులు కంటే వాటా తక్కువ ఉన్న బీవోబీ,పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఓబీసీ వంటి బ్యాంకులతో ప్రారంభించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

యాక్సిస్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీ.జే నాయక్ నేతృత్వంలో కమిటీ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వానికి ఉన్న వాటాను 50 శాతం దిగువకు తగ్గించుకోమని సిఫార్సుచేసింది. దీంతో పీఎస్‌యూ బ్యాంకులు అధిక రుణాలను మంజూరు చేయడానికి కావల్సిన మూలధనాన్ని సులభంగా సమకూర్చుకోవాలని సూచించింది. గత కొంత కాలంగా బ్యాంకులు వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనాన్ని ప్రభుత్వం సమకూరుస్తుండటంతో పలు బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలో ఎస్‌బీఐతో సహా 22 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా వీటిలో 21 బ్యాంకులు స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి.

ఈ లిస్టయిన బ్యాంకుల్లో  5 బ్యాంకుల్లో ప్రభుత్వం 80 శాతానికిపైగా వాటాను కలిగి ఉంది. నాలుగు బ్యాంకుల్లో 70 నుంచి 80 శాతం వాటా, ఆరు బ్యాంకుల్లో 60 నుంచి 70 శాతం, మరో ఆరు బ్యాంకుల్లో 50 నుంచి 60 శాతం వాటాను ప్రభుత్వం కలిగి ఉంది. ఈ మధ్యనే ఏర్పడిన భారతీయ మహిళా బ్యాంక్ ఇంకా స్టాక్ మార్కెట్లో నమోదు కాలేదు. అందువల్ల ఈ బ్యాంకులో 100 శాతం వాటా ప్రభుత్వం వద్దే వుంటుంది. అలాగే ఎస్‌బీఐకి అనుబంధంగా మరో అయిదు ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నప్పటికీ వాటిలో మోజార్టీ వాటా ఎస్‌బీఐనే కలిగి ఉంది. అన్నిటికంటే అత్యధికంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వానికి 88.63% వాటా ఉండగా, 88%తో యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అత్యల్పంగా 56.6% వాటా ఉంది.

 తలకు మించిన భారం...
 పీఎస్‌యూ బ్యాంకుల వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనం సమకూర్చడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 14,000 కోట్లు అదనపు మూలధనం సమకూర్చగా, ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌లో రూ.11,200 కోట్లు సమకూర్చడం తెలిసిందే. అదనపు మూలధనం సమకూర్చడం కంటే ప్రభు త్వ వాటాను తగ్గించుకోవడం, పబ్లిక్ ద్వారా ఈ నిధులను సేకరించుకోవడానికి ఆర్‌బీఐ ప్యానల్ మొగ్గు చూపింది.

 స్వాగతించిన మార్కెట్లు
 పీఎస్‌యూ బ్యాంకు బోర్డుల్లో మరింత పారదర్శకత పెంచుతూ, ప్రభుత్వ వాటాలను తగ్గించుకునే విధంగా ఆర్‌బీఐ కమిటీ చేసిన సూచనలను మార్కెట్లు స్వాగతించాయి. మార్కెట్ సూచీలు స్థిరంగా ముగిసినప్పటికీ నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3.3% పెరిగింది.  కెనరా, ఇండియన్ బ్యాంకులు ఒక్కరోజులోనే 11 శాతానికిపైగా పెరగడం విశేషం.  బ్యాంకులకు మూలధనం అవసరం కావడంతో ఈ నిర్ణయం పీఎస్‌యూ బ్యాంకులను మరింత పటిష్టపరుస్తుందని షేర్‌ఖాన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ దువా పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న ఆశాభావం, ఆర్థిక వృద్ధిరేటు గాడిలో పడుతుందన్న నమ్మకంతో గత కొంతకాలంగా పీఎస్‌యూ బ్యాంకు షేర్లు పరుగులు తీస్తున్నాయి. 2013లో 30 శాతం నష్టపోయిన పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ ఏడాది గడిచిన నాలుగున్నర నెలల్లో 29%కి పైగా పెరగడం విశేషం.

 వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు
 నాయక్ కమిటీ సిఫార్సులను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రకటించింది. ఈ సిఫార్సులను తక్షణం తిరస్కరించకపోతే సమ్మెకు వెనుకాడమని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం హెచ్చరించారు. ప్రభుత్వ వాటాను 51% కంటే తగ్గించడం ద్వారా వీటిని పరోక్షంగా ప్రైవేటీకరించేలా ఈ సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.
 
 ఏ బ్యాంకులో ఎంతంటే...
 
 బ్యాంకు పేరు                                     ప్రభుత్వ వాటా%
 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా                  88.63
 యునెటైడ్ బ్యాంక్                                88
 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర                           85.21
 ఇండియన్ బ్యాంక్                                81.51
 పంజాబ్ సింథ్                                     81.42
 యూకో బ్యాంక్                                    77.20
 ఐడీబీఐ                                              76.50
 విజయా బ్యాంక్                                   74.06
 ఇండియన్ ఓవర్సీస్                               73.80
 కెనరా బ్యాంక్                                       69
 సిండికేట్ బ్యాంక్                                    67.39
 బ్యాంక్ ఆఫ్ ఇండియా                            66.70
 కార్పొరేషన్ బ్యాంక్                              63.33
 ఆంధ్రా బ్యాంక్                                    60.14
 యూనియన్ బ్యాంక్                           60.13
 ఓరియంటల్ బ్యాంక్                             59.13
 అలహాబాద్ బ్యాంక్                             58.13
 పంజాబ్ నేషనల్ బ్యాంక్                       58.87
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా                   58.6
 దేనా బ్యాంక్                                   58.01
 బ్యాంక్ ఆఫ్ బరోడా                           56.26

 

Advertisement
Advertisement