ఒడిదుడుకుల వారం! | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల వారం!

Published Mon, May 23 2016 1:12 AM

ఒడిదుడుకుల వారం!

డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యం
* ఎస్‌బీఐ, కోల్ ఇండియా దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు
* రుతుపవన అంచనాలూ కీలకమే !
* విశ్లేషకుల అభిప్రాయం

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, రుతుపవనాల గమనం తదితర అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఒడిదుడుకులు తప్పవని వారంటున్నారు.

విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ సరళి, ముడి చమురు ధరల, రూపాయి కదలికలు, రుతుపవనాల గమనంపై ప్రకటనలు. తదితర అంశాలూ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని నిపుణుల ఉవాచ.
 
మరింత బలహీనంగా మార్కెట్..
అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్, రుతుపవనాల రాక, కంపెనీల గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపకుడు విజయ్ సింఘానియా చెప్పారు. మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ఎక్స్‌పైర్ అవుతాయని, ట్రేడర్ల పొజిషన్ల రోల్ ఓవర్ కారణంగా మార్కెట్‌లో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయని వివరించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మే నెల కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని, స్టాక్ సూచీలు మరింత బలహీనపడవచ్చని యస్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నటాషా శంకర్ అంచనా వేస్తున్నారు.

వడ్డీరేట్లకు సంబంధించి భవిష్యత్ అంచనాల కారణంగా ప్రపంచ మార్కెట్లు గత వారంలో దాదాపు రెండు నెలల కనిష్టానికి పతనమయ్యాయని ట్రేడ్‌బుల్స్ సీఓఓ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందనే అంచనాల మధ్య విదేశీ నిధులు భారీగా తరలిపోతాయనే భయాలు నెలకొన్నాయని  ఏంజెల్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ వైభవ్ అగర్వాల్ చెప్పారు
 
కీలక కంపెనీల ఫలితాలు...,
టాటా పవర్, బీపీసీఎల్ కంపెనీలు ఫలితాలను ఈ నెల 23న (సోమవారం) వెల్లడించనున్నాయి. టెక్ మహీంద్రా, సిప్లా, కోల్గేట్ పామోలివ్ (ఇండియా), లు ఈ నెల 24న(మంగళవారం), బజాజ్ ఆటో, గెయిల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీలు ఈ నెల 25(బుధవారం), ఎస్‌బీఐ, భెల్ ఈనెల 27న(శుక్రవారం), కోల్ ఇండియా  ఈ నెల 28న(శనివారం)తమ ఫలితాలను వెల్లడిస్తాయి. ఇవే కాకుండా ఓఎన్‌జీసీ, ఐఓసీ,  పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్,  అశోక్ లేలాండ్,  ఇండియా సిమెంట్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, అబాట్ ఇండియా, అబాట్ ఇండియా, జీఎస్‌కే ఫార్మా  వంటి కంపెనీలు నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి.

అంతా వరుణుడి దయ...
వర్షాలు ఎలా కురుస్తాయనేది రానున్న వారాల్లో  ఆర్థిక వ్యవస్థకే కాకుండా, స్టాక్ మార్కెట్‌కు కూడా కీలకమని నిపుణులంటున్నారు. రానున్న 4-6 వారాల్లో రుతుపవనాలపై అంచనాలేనని స్టాక్ మార్కెట్‌కు కీలకమని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్(ఈక్విటీస్) పంకజ్ శర్మ చెప్పారు. గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 188 పాయింట్లు(0.73%) క్షీణించి,  25,302  పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 65(0.83 శాతం) పాయింట్లు క్షీణించి 7,750 పాయింట్ల వద్ద ముగిశాయి.
 
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..
గత వారంలో  విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,064 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారని ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడించాయి. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ రూ.1,795 కోట్లు ఈక్విటీ మార్కెట్లో నికరంగా ఇన్వెస్ట్ చేయగా, రూ.3,496 కోట్ల పెట్టుబడులను డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు.   అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన గురువారం రోజు విదేశీ ఇన్వెస్టర్లు రూ.341 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

బీజేపీ అస్సాంలో అధికారంలోకి రావడం, పశ్చిమ బెంగాల్, కేరళలో ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడడంతో సంస్కరణల్ని కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తుందని బీఎన్‌పీ పారిబా ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ శ్రేయాశ్ దేవాల్కర్ అంచనా వేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.29,558 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో రూ.14,706 కోట్ల పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.4,436 కోట్లు  ఉపసంహరించుకున్నారు.

Advertisement
Advertisement