ఫండ్స్ కూ ‘తార’ల తళుకు! | Sakshi
Sakshi News home page

ఫండ్స్ కూ ‘తార’ల తళుకు!

Published Thu, May 5 2016 1:39 AM

ఫండ్స్ కూ ‘తార’ల తళుకు!

సెలబ్రిటీలతో ప్రచారానికి సెబీ యోచన..
ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం
దీంతో ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతాయని అంచనా
ఇన్వెస్టర్ల ఫండ్ ఏర్పాటు చేయనున్న యాంఫీ
కొత్త స్కీమ్స్‌కు హిందీ పేర్లు పెడుతోన్న సంస్థలు

మ్యూచువల్ ఫండ్స్.. ఈ పేరు పట్టణాల్లో ఉన్న వారికి పరిచయమై ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రం అంతగా తెలిసి ఉండదు. అందుకే వీటిని అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో సెబీ పలు మార్గాలను అన్వేషిస్తోంది. అందులో ఒకటి... సెలబ్రిటీలను వీటికి ప్రచారకులుగా తీసుకురావాలనే యోచన. అంటే ఇకపై సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, ఎం.ఎస్ ధోని, విరాట్ కోహ్లి వంటి సెలబ్రిటీలు.. పలు కంపెనీల ఉత్పత్తులకు మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)కి ప్రచారకులుగా వ్యవహరిస్తారమన్న మాట. అంతా సక్రమంగా జరిగితే వీరు ఎంఎఫ్ గురించి ప్రజల్లో అవగాహన పెంచి, వాటిల్లోకి ఇన్వెస్ట్‌మెంట్‌లను ఆకర్షించడానికి దోహదపడతారు. ఎంఎఫ్ సంస్థలు కూడా ప్రజలకు చేరువ కావడం కోసం వినూత్న మార్గాలను అవలంబిస్తున్నాయి.

 మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మాత్రం సెలబ్రిటీలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు ప్రచార కర్తలుగా వ్యవహరించడానికి ఇప్పటివరకూ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దేశంలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచడమనే అంశంపై సెబీ అధికారులు, మ్యూచువల్ ఫండ్ సంస్థల ఎగ్జిక్యూటివ్స్ మధ్య ఇటీవల ఒక సమావేశం జరిగింది. ఇందులోనే సెలబ్రిటీల అంశం తెరపైకి వచ్చింది. అధికారులందరూ సెలబ్రిటీలను ప్రచార కర్తలుగా ఉపయోగించుకుంటే బాగుం టుందనే అంశాన్ని సెబీ చైర్మన్‌కు వ్యక్తీకరించారు. సెబీ ఒకవేళ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే.. యాంఫీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అదనంగా రూ.120-రూ.130 కోట్లను ఇన్వెస్టర్ల ఎడ్యుకేషన్ కోసం, సెలబ్రిటీల కోసం జమ చేసుకోవాల్సి వస్తుందని సెబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

 ఇక నుంచి యాంఫీకీ కొంత మొత్తం
ఎంఎఫ్ ఇన్వెస్టర్లు పెట్టుబడిపెట్టే మొత్తంలో ప్రతి రూ.100లో ఆర్థిక అక్షరాస్యత, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ నిమిత్తం 2 పైసల్ని చార్జ్ చేసుకోవడానికి ఫండ్ కంపెనీలకు సెబీ అనుమతినిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం వరకు ఫండ్ కంపెనీలకే ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టుకునే అధికారం ఉండేది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఫండ్ సంస్థలు చార్జ్ చేసే 2 పైసల్లో 1 పైసాను యాంఫీకి బదిలీ చేయాల్సి ఉంది. ఈ మొత్తంలో యాంఫీ మొత్తం పరిశ్రమకు సంబంధించి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఫండ్ ను ఏర్పాటు చేస్తుంది.

అడ్వరై ్టజింగ్, మార్కెటింగ్‌లో అపార అనుభవం ఉన్న ఒక టాప్ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల పెంపునకు సంబంధించి సెలబ్రిటీలను ప్రచార కర్తలుగా ఉపయోగించుకోవాలనే ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపితే.. సెలబ్రిటీల వల్ల ఇన్వెస్టర్లలో వారి ఇన్వెస్ట్‌మెంట్లపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. అలాగే సెలబ్రిటీలు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదనే విశ్వాసాన్ని ఇన్వెస్టర్లలో కలిగించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సెలబ్రెటీని ఎంపిక చేసుకోవడం కష్టసాధ్యమని తెలిపారు.

ప్రాంతీయ భాషలపై ఎంఎఫ్‌ల కన్ను
ఎఫ్‌ఎంసీజీ సంస్థలు, టూవీలర్ సహా చిన్న కారు కంపెనీల తర్వాత ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా గ్రామీణులకు చేరువ కావడం కోసం వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఇవి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌కు ఆంగ్లంలో పేర్లు పెట్టడానికి  బదులు ఇప్పుడు హిందీలో పేర్లు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎంఎఫ్ పరిశ్రమలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మహీంద్రా మ్యూచువల్ ఫండ్ సహా అసెట్స్ ప్రకారం చూస్తే మూడో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థ రిలయన్స్ ఎంఎఫ్ వాటి కొత్త పథకాలకు హిందీలో పేర్లు పెట్టడానికి సిద్ధమయ్యాయి.

ఇవి ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌కు కర్ బచత్ యోజనా అని, చిల్డ్రన్ ఫండ్‌కు బాల్ వికాస్ యోజనా అని, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ స్కీములను బచత్ యోజనా, నివేశ్ లక్ష్య అనే పేర్లతో తీసుకురావడానికి సెబీ అనుమతిని కోరాయి. ‘గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు స్టాక్స్, బాండ్స్, ఎంఎఫ్‌ల గురించి అంతగా తెలియదు. అందుకే భాష ద్వారా వారికి చేరువ కావాలని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రయత్నించాలి’ అని మహీంద్రా ఎంఎఫ్ ఎండీ అశుతోష్ తెలిపారు. గ్రామీణులు అర్థం చేసుకునే భాషలో ప్రొడక్ట్‌లను తీసుకువస్తే మంచి ఫలితాలు వస్తాయని రిలయన్స్ ఎంఎఫ్ ప్రెసిడెంట్ సుదీప్ సిక్కా పేర్కొన్నారు.

Advertisement
Advertisement